వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ తో కలిసి క్విడ్ ప్రో కో వ్యవహారాలు నడిపిన నిమ్మగడ్డ ప్రసాద్ ఇప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడుల పేరుతో ఆయన మోసం చేసిన రస్‌అల్‌ఖైమా న్యాయపోరాటం చేస్తోంది. తాజాగా సుప్రీంకోర్టు ఆయనను రూ.125 కోట్ల నగదు, 37 ఎకరాల భూమి పత్రాలను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నిజానికి ఆయనను రూ.600 కోట్ల జమ చేయమని చెప్పింది. కానీ తన వద్ద లేవని రూ.125 కోట్ల నగదు, 37 ఎకరాల భూమిని పెడతానని విజ్ఞప్తి చేశారు. త్వరలో ఈ మోసానికి సంబంధించి నిమ్మగడ్డ పాపం పండే అవకాశం ఉంది.
డబ్బులు చెల్లించాలని రస్ అల్ ఖైమా కోర్టు తీర్పు
పెట్టుబడులను వడ్డీతో సహా చెల్లించాలని రస్ అల్ ఖైమా సివిల్ కోర్టు నిమ్మగడ్డ ప్రసాద్‌కు , ఆయన కంపెనీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లించకుండా తప్పించుకునేందుకు ఆయన తెలంగాణ హైకోర్టు , ఇతర న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని RAKIA సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు రావాల్సిన సుమారు 600 కోట్ల రూపాయలను రికవరీ చేసేందుకు భారత్‌లో ఉన్న ఆయన ఆస్తులను జప్తు చేయాలని వారు కోరుతున్నారు.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు
గతంలో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ కోసం 600 కోట్ల రూపాయల డిపాజిట్ చేయాలని ఆదేశించినప్పటికీ, నిమ్మగడ్డ ప్రసాద్ తన వద్ద అంత నగదు లేదని కోర్టుకు విన్నవించారు. తాజా విచారణలో భాగంగా, 125 కోట్ల రూపాయల నగదుతో పాటు, తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దేవరయాంజల్ పరిధిలో ఉన్న 37 ఎకరాల భూమి సుమారు 400 కోట్ల విలువైనదిగా భావిస్తున్న ఒరిజినల్ పత్రాలను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసును తదుపరి విచారణకు వాయిదా వేసింది.
వాన్ పిక్ కుంభకోణంతో ఖల్లాస్
2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో వాడరేవు-నిజాంపట్నం పోర్టు , పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం రస్ అల్ ఖైమా ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అయితే, నిమ్మగడ్డ ప్రసాద్ రస్ అల్ ఖైమా నుంచి వచ్చిన పెట్టుబడులను దారి మళ్లించి, అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లోకి క్విడ్ ప్రో కో పద్ధతిలో పెట్టుబడులుగా మళ్లించారు. దీనివల్ల ప్రాజెక్ట్ అటకెక్కి తమ పెట్టుబడులు వృథా అయ్యాయని రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ న్యాయపోరాటం మొదలుపెట్టింది.
సెర్బియాలో ఓ సారి అరెస్ట్
ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రస్ అల్ ఖైమా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదుతో 2019 జూలైలో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దీని ఆధారంగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. తమను మోసం చేసి వందల కోట్లు మళ్లించారని రస్ అల్ ఖైమా ఆరోపించగా, సుమారు రెండు నెలల పాటు ఆయన సెర్బియాలో గృహనిర్బంధంలో ఉండాల్సి వచ్చింది. కరోనా కారణంగా జైళ్లలో ఉన్న వారిని వదిలేయడంతో ఆయన ఇండియాకు వచ్చారు. లేకపోతే అక్కడి జైల్లోనే ఉండేవారు.
