ఏపీ ఎన్నికల కమిషన్ జాయింట్ డైరెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికలు నిర్వహించకుండా.. జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ కుట్రలు చేశారని.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున… ఎలాంటి సెలవులు పెట్ట కూడదని సర్క్యూలర్ ఇచ్చినప్పటికీ.. జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ తాను 30 రోజుల పాటు సెలవులపై వెళ్లడమే కాదు.. ఇతర ఉద్యోగుల్ని కూడా రెచ్చగొట్టి.. వారు కూడా సెలవుపై వెళ్లాలని ఒత్తిడి చేశారు. ఈ అంశం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ దృష్టికి రావడంతో విచారణ జరిపిన ఆయన నిజమేనని తేలడంతో… చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించారు. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయని నిర్ణయించి… విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జీవీ సాయిప్రసాద్ ఇక నుంచి ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం.. ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎస్ఈసీ రమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు.. తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా చెబుతున్నాయి. అయితే.. స్టేట్ ఎలక్షన్ కమిషన్‌లోని ఉద్యోగుల్ని కూడా కొంత మంది ప్రభావితం చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషన్‌లో పని చేసే ఉద్యోగులందరితోనూ.. సహాయనిరాకరణ చేయించడమో.. లేకపోతే.. సెలవులపై వెళ్లడమో చేస్తే.. ఎస్ఈసీ పని చేయడానికి చాన్స్ ఉండదన్న ఉద్దేశంతో .. జీవీ సాయి ప్రసాద్ ద్వారా సెలవుుల వ్యూహం పన్నినట్లుగా అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారం గురించి.. తెలియడంతో.. ఎస్ఈసీ రమేష్ కుమార్ .. వెంటనే చర్యలు తీసుకున్నారు. ఎన్నికల విషయంలో… న్యాయస్థానాల నుంచి ఎలాంటి స్టే ఆర్డర్స్ రాకపోతే.. మరింత దూకుడుగా ఆయన తన అధికారాలను ఉపయోగించి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో బదిలీ చేయమని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని ఇప్పటికే సీఎస్‌కు ఆయన లేఖ రాశారు. కానీ సీఎస్ మాత్రం స్పందించలేదు.