నితిన్‌కి ఓ హిట్టు అత్యవసరం. వరుస ఫ్లాపులకు తప్పకుండా బ్రేక్ వేయాల్సిన తరుణం వచ్చింది. తన హోప్స్ అన్నీ `తమ్ముడు` సినిమాపైనే. ఈనెల 4న ఈ సినిమా వస్తోంది. బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ ఏం లేదు. కాబట్టి మంచి టాక్ వస్తే – గట్టెక్కొచ్చు. తమ్ముడు సినిమాపై దిల్ రాజు చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో సగం నాన్ థియేట్రికల్ నుంచి వచ్చాయి. నితిన్ కంటే, వేణు శ్రీరామ్ కంటే దిల్ రాజు కథని నమ్మారు. ‘విజువల్ గా కొత్తగా చూపించాల్సిన సినిమా ఇది. అందుకే నితిన్ పై అంత ఖర్చు పెట్టాం’ అని దిల్ రాజు చెబుతూ వచ్చారు. ట్రైలర్ లో ఆ కలర్ కనిపించింది కూడా.
అక్కని కాపాడ్డానికి తమ్ముడు చేసే సాహసం ఈ సినిమా. ఓ ఊరు, అక్కడి మనుషులు, బలమైన ప్రతినాయకుడు.. అక్కడో తమ్ముడికి ఉన్న దూరం.. ఇలా సెటప్ కూడా బలంగానే కనిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్ మిక్స్ ఎప్పుడూ మంచి ఫలితాల్ని తీసుకొస్తుంది. రెగ్యులర్ హీరో – హీరోయిన్ ట్రాక్, పాటలు, కామెడీ… వీటిని నమ్ముకోకుండా కేవలం కథని చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తోంది. దర్శకుడుగా వేణు శ్రీరామ్ కి ఓ మార్క్ వుంది. ఆయన అది కూడా దాటుకొని వచ్చి ఈ సినిమా తీశారన్న భరోసా ట్రైలర్ తో కలిగింది. ఎలాంటి కథ అయినా విజువల్ ఫీస్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు. ‘తమ్ముడు’ కూడా అదే దారిలో వెళ్లింది. విజువల్ గా ట్రైలర్ చాలా బాగుంది. ఎమోషన్ కూడా కనెక్ట్ అయితే… నితిన్ వరుస ఫ్లాపులకు బ్రేక్ పడినట్టే.