గత రెండేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఆర్ధిక సహాయం కోసం ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్రానికి ఇవ్వవలసినదాని కంటే చాలా ఎక్కువే ఇచ్చామని భాజపా నేతలు వాదిస్తారు. అడిగిన దానిలో పదో వంతు కూడా విదిలించడం లేదని ముఖ్యమంత్రి ఆరోపిస్తుంటారు. ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి. అయితే ప్రత్యేక హోదాకి బదులుగా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా మంచి ఆర్ధిక ప్యాకేజి ఇస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఏడాది క్రితం మీడియా సాక్షిగా హామీ ఇచ్చారు. అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి అదే విషయం ప్రధానిని అడిగితే అది నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని, రోడ్డు మ్యాప్ తయారుచేయమని చెప్పానని సర్దిచెప్పి పంపించేస్తుంటారు. సుమారు రెండేళ్ళ కసరత్తు చేసిన తరువాత ఎట్టకేలకు నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వవలసిన ఆర్ధిక సహాయ సహకారాల గురించి నివేదిక తయారుచేసి ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో పెట్టిందని రాష్ట్ర అభివృద్ధి కమీషనర్ మరియు ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి పివి రమేష్ మీడియాకి తెలిపారు. కనుక త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకొని రాష్ట్రానికి ఆర్ధిక సహాయం అందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
భాజపా నేతలు రాష్ట్రానికి ఇవ్వవలసిన దానికంటే చాలా ఎక్కువే ఇచ్చామని చెపుతున్నప్పుడు, నీతి ఆయోగ్ చెప్పిందని కేంద్రం మళ్ళీ అదనంగా నిధులు మంజూరు చేస్తుందా లేకపోతే ఇచ్చినదానితో లెక్కలు సరిపెట్టి చేతులు దులుపుకొంటుందా చూడాలి.