ప్లానింగ్ విషయంలో ఎస్.ఎస్.రాజమౌళిని మించిన వాళ్లు టాలీవుడ్ లోనే లేరు. ఎప్పుడు ఎవరితో సినిమా తీయాలి? ఎలా మార్కెటింగ్ చేయాలి? అనే విషయాల్లో జక్కన్న ప్లానింగ్ కి తిరుగు ఉండదు. అన్నింటికి మించి బడ్జెట్ దగ్గర కూడా చాలా నిక్కచ్చిగా ఉంటారు. ఆయన సినిమాల బడ్జెట్లన్నీ భారీగానే ఉంటాయి. కాకపోతే ఆ భారీతనానికి కూడా ఓ లిమిట్ అంటూ ఉంటుంది. ఎంతలో తీయాలో అంతలోనే తీస్తారు. ఓ పది శాతం అటూ ఇటూ అవ్వడం ఎక్కడైనా, ఎవరి విషయంలో అయినా సాధాణమే.
అయితే ‘వారణాసి’ విషయంలో రాజమౌళి బడ్జెట్ లిమిట్స్ ఏం పెట్టుకోలేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. వారణాసి బడ్జెట్ ఎంతన్న విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.700 కోట్లని, రూ.1000 కోట్లని, రూ.1500 కోట్లని రకరకాలుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ అంకెలన్నీ దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తన సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాబట్టుకోగలిగే సత్తా తన సినిమాకు ఉందని రాజమౌళి భావిస్తున్నారు. పైగా ‘వారణాసి’ హాలీవుడ్ వెర్షన్ నీ రిలీజ్ చేయాలన్న ప్లాన్ వుంది. అక్కడ తన సినిమాని మార్కెట్ చేసుకోగలిగితే… ఎంతైనా వసూలు చేయొచ్చన్న ధీమా వుంది. అందుకే ఖర్చు విషయంలో లిమిట్స్ పెట్టుకోలేదు. ఈ సినిమా కోసం మహేష్ బాబు పారితోషిం తీసుకోకుండానే పని చేస్తున్నారు. హీరో పారితోషికం ఎప్పుడైతే భారం కాదో, అప్పుడు దర్శక నిర్మాతలకు మరింత స్వేచ్ఛ లభిస్తుంది. ఆ మొత్తం కూడా సినిమా మేకింగ్ పైనే పెట్టొచ్చు. ఇవన్నీ సినిమా బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాయి.
బడ్జెట్ కు ఓ పరిమితి ఉంటేనే వెండి తెరపై జక్కన్న అద్భుతాలు సృష్టిస్తాడు. అలాంటిది అలాంటి హద్దులు లేకపోతే ఇంకేం చేయగలడో ప్రత్యేకంగా చెప్పాలా..?!
