వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒకటే చర్చ.. అధికారంలో ఉన్నప్పుడు అండగా లేరు, ఇప్పుడు కనీసం పలకరించే తీరిక లేదు అనే. పార్టీని భుజాన మోసిన సామాన్య కార్యకర్త ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. పార్టీ కోసం కేసులు భరించి, ప్రత్యర్థులతో తలపడి, ఇప్పుడు ప్రాణాల మీదకు వస్తుంటే.. తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం బెంగళూరు ప్యాలెస్కే పరిమితం కావడంపై క్యాడర్ రగిలిపోతోంది.
క్యాడర్ ప్రాణాలు పణంగా పెడతారా?
పల్నాడు ప్రాంతంలో వైసీపీ కార్యకర్తల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆ పార్టీ సోషల్ మీడియాలో ఏడుపులు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాతి పరిణామాల్లో ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న దాడులు, పోలీసు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కార్యకర్తలు, తమను పట్టించుకునే నాథుడే లేడని సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీ కోసం రక్తం చిందించాం.. ఇప్పుడు కనీసం ఓ పరామర్శకు కూడా నోచుకోలేకపోతున్నాం అంటూ పల్నాడు క్యాడర్ పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. జగన్ రెడ్డి గెలిచినప్పుడు ప్యాలెస్లకే పరిమితమై, ఓడిపోయినప్పుడు బెంగళూరుకు వెళ్లిపోతే.. క్షేత్రస్థాయిలో కక్షపూరిత రాజకీయాల మధ్య నలిగిపోతున్న తమను ఎవరు కాపాడతారని వారు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
కార్యకర్తలను ఎప్పుడు పట్టించుకున్నారు?
నిజానికి, జగన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో కార్యకర్తలకు ఇచ్చే విలువపై ఎప్పుడూ నీలినీడలు ఉంటూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని కలిసే భాగ్యం కనీసం మంత్రులకే దక్కలేదన్న విమర్శలు ఉండగా, ఇక సామాన్య కార్యకర్త పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఐదేళ్ల పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి, కేవలం కొంతమంది ఐఏఎస్ అధికారులు, సలహాదారుల మాటలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈరోజు పార్టీ ఈ దుస్థితికి చేరుకుందనేది నగ్న సత్యం. కార్యకర్తలను వదిలేసి వాలంటీర్లను నెత్తిన పెట్టుకున్నారు. అదే సమయంలో విచ్చలవిడిగా సాగిన దాడులు, దౌర్జన్యాలు ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు శాపంగా మారాయి. పైస్థాయి నాయకుల ప్రోత్సాహంతో అప్పట్లో ప్రత్యర్థులపై విరుచుకుపడిన కార్యకర్తలు, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పుడు రెచ్చగొట్టిన నాయకులు ఇప్పుడు కనీసం బెయిల్ ఇప్పించడానికి కూడా ముందుకు రావడం లేదని, ఫోన్లు చేసినా ఎత్తడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. చేసిన తప్పులకు ప్రతిఫలం అనుభవించాల్సి వస్తున్నప్పుడు, అండగా ఉండాల్సిన నాయకుడు కనిపించకుండా పోవడం వారిని మరింత కృంగదీస్తోంది.
జగన్ గురించి ఇప్పటికీ తెలుసుకోలేకపోతే ఎలా?
జగన్ రెడ్డి రాజకీయ శైలి ఎప్పుడూ వాడుకుని వదిలేయడం అన్నట్లుగానే ఉంటుంది. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని, జైలుకు వెళ్లిన వారెందరో ఇప్పుడు రోడ్డున పడ్డారు. జగన్ మాత్రం తన బెంగళూరు నివాసంలో హాయిగా కాలం గడుపుతుంటే, ఇక్కడ క్షేత్రస్థాయిలో వైసీపీ జెండా మోసిన వాడు మాత్రం పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నాయకుడిని గుడ్డిగా నమ్ముకుంటే జరిగే నష్టం ఇదేనని, వైసీపీ కార్యకర్తల దుస్థితి చూస్తుంటే అర్థమవుతోంది. జకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమి ఎదురైనప్పుడు సైన్యాన్ని ముందుండి నడిపించాల్సిన సేనాని.. క్షేత్రస్థాయిని వదిలి పరాయి రాష్ట్రంలో సేదదీరుతూండటాన్ని ఆ పార్టీ క్యాడర్ ఇప్పటికైనా గుర్తిస్తే వారి జీవితాలకే కాస్త అర్థం ఉంటుంది.


