తిరుపతిలో సంచలనం సృష్టించిన విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసులో తాజాగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న మంచు కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కేసులో మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబును రెండో నిందితుడు గా, మంచు విష్ణును మూడో నిందితుడు గా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే, ఈ నోటీసులపై స్పందించిన విష్ణు.. ప్రస్తుతం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను అందుబాటులో లేనని, ఈ నెల 15వ తేదీ తర్వాత విచారణకు వస్తానని పోలీసులకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు రెండో నిందితుడిగా ఉన్న మంచు మోహన్ బాబుకు నోటీసులు అందించే విషయంలో పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనేది స్పష్టంగా తెలియకపోవడం, అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పటివరకు నోటీసులు అందించలేకపోయారు. విద్యాసంస్థల వద్ద ఫీజుల విషయంలో నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘ నేతలను బలవంతంగా కిడ్నాప్ చేసి, భౌతిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
కిడ్నాప్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉండటంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మంచు విష్ణు కోరినట్లుగా 15వ తేదీ వరకు గడువు ఇస్తారా.. లేక చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది ఉత్కంఠగా మారింది. మంచుమోహన్ బాబుకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని ఇప్పటికే మోహన్ బాబు, విష్ణు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిగే వరకూ వారు వాయిదాలు కోరే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
