సినిమాల్లో మంత్రాలకు చింతకాయలు రాలతాయి కానీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కాదు. కథలో కంటెంట్ ఉండాలి. నమ్మకాలతో, మూఢ నమ్మకాలతో, న్యూమరాలజీతో పనులు కావు. హిట్స్ రావు. సినిమా జనాలు కాస్త ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. న్యూమరాలజీని నమ్ముకుని వారం వ్యవధిలో వచ్చిన రెండు సినిమాలు థియేటర్లలో బకెట్ తన్నేశాయి. అందులో ముందుగా, ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్'(Inttelligent) గురించి చెప్పుకోవాలి. సినిమా పోస్టర్లు రిలీజ్ చేసినప్పుడు టైటిల్ రాసిన తీరుని, కింద ఇంగ్లీష్ అక్షరాలను చూసి తప్పుగా రాశారని అనుకున్నారంతా. నిర్మాత సి. కళ్యాణ్ గారికి న్యూమరాలజీ మీద ఉన్న నమ్మకంతో అలా రాశామని దర్శకుడు వీవీ వినాయక్ క్లారిటీ ఇచ్చారు. సినిమా విడుదలైంది. రిజల్ట్ ఏంటో అందరికి తెలుసు. ఇక, న్యూమరాలజీ నమ్ముకున్న మరో వ్యక్తి తరుణ్. సాధారణంగా ఆయన పేరుని ఇంగ్లీష్‌లో ‘Tarun’ అని రాస్తారు. కానీ, ‘ఇది నా లవ్ స్టోరి’ సినిమాకు ముందు నుంచి పేరులో ఒక ‘T’, ఒక ‘h’ యాడ్ చేసి ‘Tthharun’ అని రాయడం ప్రారంభించారు. ఇంటి ముందు నేమ్ ప్లేట్ కూడా మారింది. అయినా లాభం లేదు. సినిమా హిట్ కావడం కష్టమని క్రిటిక్స్ తీర్పు ఇచ్చారు. సో… న్యూమరాలజీని నమ్ముకున్నా ప్లాప్స్ తప్పవని క్లియర్ అయ్యింది.