ప్రతి రచయిత త్రివిక్రమ్ కాలేడు!

ప్రేమకథ పేరుతో సినిమాలో చెంచాడు ప్రేమ లేకుండా తీసినా ప్రేక్షకులు క్షమిస్తారేమో గానీ… ప్రేమ పేరుతో పేజీలకు పేజీలు పిచ్చి పిచ్చి రాతల రాసి ప్రేక్షకుల మీదకు వదిలితే అసలు క్షమించరు. ప్రేమికుల రోజున విడుదలైన తరుణ్ రీ ఎంట్రీ సినిమా ‘ఇది నా లవ్ స్టోరి’ అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో డైలాగులకు మామూలు రెస్పాన్స్ రావడం లేదు. ఇంత చెత్తగా డైలాగులు ఎలా రాస్తారా? అని సినిమా చూసినవాళ్లు తిట్టుకుంటున్నారు. త్రివిక్రమ్ కంటే మేం తక్కువ కాదు లేదా త్రివిక్ర‌మ్‌ని బీట్ చేయాలనే ఉద్దేశం సినిమాకి దర్శకత్వం వహించిన అన్నదమ్ములు రమేష్, గోపీల రాతల్లో ప్రేక్షకులకు కనిపించింది.

హీరో డైలాగులు:

– “వల అన్నాక చేప ప్రేమ అన్నాక పాప పడాల్సిందే”

– “క్రెడిట్ కార్డులో క్రెడిట్, డెబిట్ కార్డులో డెబిట్ ఉంది. మార్క్స్ కార్డులో మార్క్స్ మాత్రం లేవు”

ఇది పీక్స్ అసలు…

“హార్ట్ నుంచి, బెడ్ రూమ్ నుంచి అబ్బాయిలను బయటకు పంపకండి. పంపిన తర్వాత మీరే ఫీలవుతారు”: హీరో

ఒక సన్నివేశంలో

హీరోయిన్: మా అన్నయ్యకి కరాటేలో బ్లాక్ బెల్ట్
హీరో: నేను ఏ ప్యాంట్ వేసుకున్నా బ్లాక్ బెల్ట్ యే.

హీరోయిన్ డైలాగులు:

– “పాముకు కోరల్లో, అబ్బాయిలకు హార్ట్‌లో విషం ఉంటుంది”

– “హార్న్ కొడితే సైడ్, స్మైల్ కొడితే లిఫ్ట్ దొరుకుతుంది”

ఈ డైలాగులు జస్ట్ ట్రైలర్ మాత్రమే. మచ్చుకి కొన్ని. సినిమాలో ఇలాంటి ఆణిముత్యాలు ఏరుకున్న వాళ్లకి ఏరుకునన్ని దొరుకుతాయి.

తెలుగు సినిమా చరిత్రలో కాలానుగుణంగా డైలాగులు చెప్పే విధానంలో, సన్నివేశాలను తెరపై చూపించే విధానంలో మార్పులు వచ్చాయి. చాలామంది రచయితలు వచ్చారు. వెళ్లారు. కొందరు తెలుగు సినిమాపై ముద్ర వేశారు. అటువంటి రచయితల్లో త్రివిక్రమ్ ఒకరు. సన్నివేశంలో బలం లేకపోయినా మాటతో నిలబెట్టగల సత్తా ఉన్న రచయిత. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని కొందరు రచయితలు డైలాగులు రాస్తున్నారు. కానీ, త్రివిక్రమ్ స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోతున్నారు. కారణం… అనుకరణ. అనుభవంతో చెప్పే మాట అందరికీ అర్థమవుతుంది. అనుకరణ నుంచి వచ్చే మాట నవ్వుల పాలవుతుంది. త్రివిక్రమ్‌లా రాయాలనుకునుకోవడం వేరు, సన్నివేశానికి తగ్గట్టు అందులో భావాన్ని ప్రేక్షకులకు అర్థం అయ్యేలా డైలాగులు రాయడం వేరు. త్రివిక్రమ్ తర్వాత వచ్చిన కొరటాల శివ దర్శకుడిగా, డైలాగ్ రైట‌ర్‌గా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశాడు. ఆయన ఎక్కడా పంచ్ డైలాగుల కోసం, ప్రాస కోసం పాకులాడలేదు. అందువల్ల, వర్ధమాన దర్శక రచయితలు గమనించవలసిన అంశం ఏంటంటే… ప్రతి రచయిత త్రివిక్రమ్‌ కాలేడు. కొరటాల శివ కాలేడు. ఒకర్ని కాపీ లేదా ఇమిటేట్ చేయాలనుకోవడం మానేస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.