సెప్టెంబరు బాక్సాఫీసు కళకళలాడింది. అక్టోబరులోనూ కాంతార రూపంలో శుభారంభం లభించింది. ఈనెలలోనూ మంచి సినిమాలే వరుస కట్టబోతున్నాయి. కాబట్టి ఆశల పల్లకిలో టాలీవుడ్ ఊరేగుతోంది. దీపావళి సీజన్లో 4 సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కె-ర్యాంప్, డ్యూడ్, తెలుసు కదా, మిత్రమండలి చిత్రాలు ఈ దీపావళికి సందడి చేయనున్నాయి. దీపావళికి ముందు వారం మాత్రం బాక్సాఫీసు కాస్త ప్రశాంతంగా కనిపిస్తోంది. అలాగని సినిమాలు లేవని కాదు. మూడు సినిమాలు వస్తున్నాయి. అయితే అన్నీ చిన్నవే. శశివదనే, అరి, కానిస్టేబుల్ ఈ మూడు చిత్రాలు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి.
అయితే ఈవారం కూడా ‘కాంతార చాప్టర్ 1’, ‘ఓజీ’ చిత్రాలే బాక్సాఫీసుకు పెద్ద దిక్కు కానున్నాయి. అక్టోబరు 2న విడుదలైన ‘కాంతార…’ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. శని, ఆదివారాల్లో `కాంతార` వసూళ్లు బాగున్నాయి. ఓజీ రెండోవారంలోనూ తన మనుగడ సాగిస్తోంది. దసరా రోజున మళ్లీ ఓజీ థియేటర్లు అభిమానులతో కిటకిటలాడాయి. ఈ యేడాది తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ రన్ ఈవారాంతం కూడా కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ‘కాంతార’ వైపు కుటుంబ ప్రేక్షకులు మెగ్గు చూపించడం కలిసొచ్చే అంశం. తెలుగులో కాంతార కనీసం అటూ ఇటుగా రూ.60 కోట్లు వసూలు చేయొచ్చన్నది ఓ అంచనా. ఓ డబ్బింగ్ సినిమాకు ఇన్ని వసూళ్లు అందాయంటే మామూలు విషయం కాదు. అయితే ఈవారం కాంతార ఆక్యుపెన్సీ ఎంత ఉంటుందన్నదాన్ని బట్టి ఫైనల్ రన్ ఆధారపడి ఉంటుంది.