దర్శకుడిగా తరుణ్ భాస్కర్ కాబబులిటీ ఏమిటో మనకు తెలుసు. నటుడిగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారాయన. అయితే ఇప్పుడు హీరోగా అవతారం ఎత్తారు. ‘ఓం శాంతి శాంతి శాంతి’తో. మలయాళంలో విజయవంతమైన ‘జయ జయ జయహే’ చిత్రానికి రీమేక్ ఇది. ఈషారెబ్బా కథానాయికగా నటించింది. ఈనెల 30న విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
ట్రైలర్ ఫన్ రైడ్ గా సాగిపోయింది. గోదారోళ్ల భాషనీ, యాసనీ, సొగసునీ, ఎటకారాన్నీ, చమత్కారాన్నీ పాత్రలు.. పాత్రధారులు బాగా పట్టుకొన్నారనిపించింది. చేపలకు సంబంధించిన రిఫరెన్స్‌లు ఎక్కువగా వినిపించాయి. తరుణ్ భాస్కర్ ని ఈ గెటప్పులో చూడడం కొత్తగా అనిపించింది. ఓ భార్య తాలుకూ రివైంజ్ ఈ కథ. మలయాళ సినిమా చూసిన వాళ్లకు ఆ సంగతి తెలిసే ఉంటుంది. కాకపోతే.. మలయాళం సినిమా చూసిన వాళ్లకు సైతం ఈ కథని కొత్త ఫ్లేవర్ లో చూపించే ప్రయత్నం అయితే ఈ రీమేక్ లో జరిగిందనిపిస్తోంది. కామెడీ గ్యాంగ్ చాలామందే కనిపిస్తున్నారు. అయితే ఇందులో బ్రహ్మాజీ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందనిపిస్తోంది. గోదావరి అంటేనే ఎటకారం. అది ఈ సినిమాలో ఎంత పండితే అంత ప్లస్సు. ’35’ చిత్రాన్ని అందించిన సృజన్ ఈ చిత్రానికి నిర్మాత. ’35’ మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో డబ్బులూ వస్తాయని ఆయన ఆశిస్తున్నారు. సంక్రాంతి మూడ్ లోంచి ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. గోదావరి కథతో.. మళ్లీ ఆ మూడ్‌లోకి తీసుకెళ్తారేమో చూడాలి.
