రివ్యూ : భావోద్వేగాల స‌మ్మేళ‌నం.. ఈ “ఊపిరి”

రీమేక్ సినిమా అన‌గానే మ‌న‌వాళ్లు రిలాక్స్ అయిపోతారు. క‌థ ఉంది.. స‌న్నివేశాలున్నాయి.. పాత్ర‌లు క‌ళ్లముందు క‌ద‌లాడుతుంటాయి… ఇంకా ఆలోచించాలా? అన్నది చిత్ర రూప‌క‌ర్త‌ల ప్ర‌శ్న‌. కానీ ఆలోచించాలి. …రీమేక్ క‌థ చేస్తున్న‌ప్పుడు ఇంకా ఎక్కువ‌గా ఆలోచించాలి.

ఆ క‌థ‌ని మ‌న‌దైన శైలిలో ఎలా ఆవిష్క‌రించాలి? మ‌న ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టు స‌న్నివేశాల్ని ఎలా మ‌ల‌చుకోవాలి? మాతృక‌లోని త‌ప్పులేంటి? మ‌నం కొత్త‌గా చూపించేది ఏంటి? – వీట‌న్నిటికీ బుర్ర పెట్టాల్సిందే. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌న ద‌ర్శ‌కులు మ‌క్కీ సూత్రాన్నే న‌మ్ముకొంటున్నారు. అందుకే రీమేక్ సినిమా మేక్ లా గుచ్చుకొంటోంది. ఇప్పుడొచ్చిన ఊపిరి కూడా ఫ్రెంచ్ సినిమా ఇన్‌ట‌చ్‌బుల్స్‌కి రీమేకే. ఆ క‌థ‌ని వంశీ పైడిప‌ల్లి తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్టు ఎలా మార్చుకొన్నాడు, కొత్త‌గా ఏం చూపించాడు? ఇత‌నూ కాపీ సూత్రాన్నే న‌మ్ముకొన్నాడా? తెలియాలంటే రివ్యూ చ‌ద‌వాల్సిందే.

* క‌థేంటి?

శ్రీ‌ను (కార్తి) ఆవారా బ్యాచ్‌. అప్పుడే జైలు నుంచి బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. స‌త్ప్ర‌వ‌ర్త‌న క‌లిగిన‌ట్టు నిరూపించుకోగ‌లిగితే.. శిక్ష త‌గ్గుతుంది. అందుకోసం ఎవ‌రికైనా సేవ చేయాలి. ఆ స‌మ‌యంలో విక్ర‌మాదిత్య (నాగార్జున‌) ద‌గ్గ‌ర ఉద్యోగం దొరుకుతుంది. విక్ర‌మ్ సంప‌న్నుడు. కానీ కుర్చున్న సీటు నుంచి క‌ద‌ల్లేడు. ఓ ప్ర‌మాదంలో అత‌ని స‌గం శ‌రీరం చచ్చుబ‌డిపోతుంది. అత‌నికో కేర్ టేక‌ర్ కావాలి. ఆ పోస్టు శీనుకి వ‌స్తుంది. శ్రీ‌ను రాక‌తో విక్ర‌మ్ జీవితంలో కొత్త ఆశ‌లు చిగురిస్తాయి. ప్ర‌తీ రోజూ… కొత్త‌గా అనిపిస్తుంది. శీనుకి కూడా విక్ర‌మ్‌తో అనుబంధం పెరుగుతుంది. శ్రీ‌ను చెల్లెలి పెళ్లి విషయంలో విక్ర‌మ్ స‌హాయ‌ప‌డ‌తాడు. అలా ఇద్ద‌రు అప‌రిచిత వ్య‌క్తుల ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. వీరి క‌థ ఏ మ‌జిలీకి చేరింది? శ్రీ‌ను – విక్ర‌మ్‌ల జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభ‌వించాయి? అన్న‌ది ఊపిరి సినిమా.

* విశ్లేష‌ణ‌

క‌థ ఇదీ అని చెప్ప‌డం కంటే.. దాన్ని తెర‌పై చూడ్డ‌మే మంచిది. ఎందుకంటే క‌థ‌కంటే, అందులోని భావోద్వేగాల‌కు పెద్ద పీట వేసిన సినిమా ఇది. ఇన్‌ట‌చ్‌బుల్స్‌ని న‌డిపించింది అలాంటి ఎమోష‌న‌ల్ సీన్సే. వంశీ పైడిప‌ల్లి కూడా వాటినే తు.చ త‌ప్ప‌కుండా పాటించాడు. మాతృక‌లో బ‌లమేంటో గ్ర‌హించి వాటికి తెలుగులో ఫీల్ త‌గ్గ‌కుండా అనువ‌దించాడు. ఆ విష‌యంలో వంశీని మెచ్చుకోవాలి. వంశీ చేసిన మార్పులు కొన్నే. అవి సినిమా నిడివి పెంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డ్డాయంతే! కార్తి పాత్ర‌ని య‌థాత‌థంగా ట్రాన్స్‌లేట్ చేశాడు. ఆ పాత్ర‌లో కార్తి చ‌క్క‌గా ఒదిగిపోయాడు. ఈ సినిమాతో నాగార్జున క్రెడిట్ అంతా కొట్టేస్తాడ‌నుకొంటే… కార్తి వాటాకొచ్చాడు. త‌న బాడీలాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివ‌రీతో.. ఆక‌ట్టుకొన్నాడు. నాగ్ – కార్తిల స‌న్నివేశాల‌న్నీ పండాయి. అవ‌నేంటి..?? తొలి అర్థ‌భాగంలో ఎమోష‌న‌ల్ సీన్ల‌న్నీ అద్భుతంగా పండాయి. అదంతా ఇన్‌ట‌చ్‌బుల్స్ పుణ్య‌మే అనుకోవాలి. శ్రీ‌ను చెల్లి పెళ్లికి విక్ర‌మ్ స‌హాయం చేయ‌డం, త‌న కుటుంబానికి త‌గ్గ‌ర చేయ‌డం, ఆ స‌న్నివేశాల్లో కార్తి హావ‌భావాలూ.. నాగ్‌తో చెప్పిన సంభాష‌ణ‌లు క‌ట్టిప‌డేస్తాయి. ఒక్కమాట‌లో చెప్పాలంటే పిండేస్తాయి. అలాగ‌ని ఏడిపించే స‌న్నివేశాలే ఉన్నాయి అనుకోవొద్దు. ప్ర‌తీ సీన్‌కీ హ్యూమ‌ర్‌ని జోడించారు. పెయింటింగ్ తో ముడిప‌డిన స‌న్నివేశాలు హిలేరియ‌స్‌గా న‌వ్విస్తాయి. ‘మా చెల్లె పెళ్లి కుదిరింది క‌దా? ఖ‌ర్చు లుంటాయి. పెయింటింగ్ వేసుకోవాలి’ అన్న డైలాగ్‌కి థియేట‌ర్లో న‌వ్వులే న‌వ్వులు. సెకండాఫ్‌లో ట్విస్టులూ, ట‌ర్న్‌లూ ఏం లేవు. మామూలుగా సాగిపోతుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే.. సినిమా బోర్ కొట్ట‌డం సెకండాఫ్ లోనే స్టార్ట‌వుతుంది. స్పెయిన్‌లో తీసిన స‌న్నివేశాలు అంత‌గా క‌దిలించ‌లేదు. తొలి భాగంతో పోలిస్తే… సెకండాఫ్ తేలిపోయింది. క్లైమాక్స్ కూడా తొంద‌ర‌గా వ‌చ్చేసింది అనిపిస్తుంది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

క‌రెక్ట్ కాస్టింగ్ అంటే ఏమిటో ఈ సినిమాలో చూడొచ్చు. నాగార్జున‌, కార్తీ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఒక‌రికి మించి మ‌రొక‌రు.. న‌టించారు. కార్తి సింప్లీ సూప‌ర్బ్‌. నాగార్జున మాత్ర‌మే ఇలాంటి పాత్ర‌లు చేయ‌గ‌ల‌రు అనిపించింది. సీట్లో కూర్చుని.. ఆడియ‌న్స్‌ని కూడా కూర్చోబెట్టాడు. త‌మ‌న్నా పాత్ర గ్లామ‌ర్‌కే ప‌రిమితం కాలేదు. ప్ర‌కాష్‌రాజ్‌, జ‌య‌సుధ‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి.. ఎవ‌రికి వారే.

* సాంకేతికంగా..

సినిమా రిచ్‌గా ఉంది. కెమెరాప‌నిత‌నం ఆక‌ట్టుకొంటుంది. గోపీ సుంద‌ర్ పాట‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేంత లేవుగానీ… థియేట‌ర్లో ఓకే. పాట‌లూ ఓ రేంజులో ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది. అబ్బూరి ర‌వి సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డ మెరుపులు మెరిపిస్తాయి. ఓ ఫ్రెంచ్ క‌థ‌ని.. తెలుగు నేటివిటికి అనుగుణంగా తీసుకొచ్చాడు వంశీ. ఫ్రెంచ్‌లో ఫీల్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ఆ విష‌యంలో వంశీని మెచ్చుకొని తీరాల్సిందే.

* చివ‌రిగా

భావోద్వేగాల స‌మ్మేళ‌నం.. ఈ ఊపిరి

తెలుగు360.కామ్ రేటింగ్‌: 3.5/5

బ్యానర్ : పి. వి. పి
నటీనటులు : నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ : టి. వినోద్
నిర్మాతలు : ప్రసాద్ వి పొట్లూరి
కథ : అబ్బూరి రవి
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
విడుదల తేది : 25.03.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com