పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర క్యాంపులపై భారత్ దాడి చేసింది. వ్యవస్థీకృతంగా అక్కడ ఉగ్ర క్యాంపుల్ని ఆర్మీ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. వాటిని గుర్తించి 9 స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై భారత్ అధికారిక ప్రకటన చేసింది.
పీవోకే పై విరుచుకుపడిన వైమానిక దళం
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ పై దండెత్తడానికి ఉగ్రవాదుల్ని రెడీ చేస్తూంటారు .పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు కూడా అక్కడి నుంచే వచ్చి మళ్లీ అక్కడికే పారిపోయారు. ఆ ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ సైన్యం ప్రోత్సాహం ఉంది. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న హఫీజ్ సయీద్ హస్తం ఉంది. అన్ని బహిరంగరహర్యాలే. చివరికి ఉగ్రక్యాంపుల్ని భారత్ ధ్వంసం చేసింది.
ఇంతటితో ఆగవు.. మరిన్ని దాడులు !
ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు సంచలనం సృష్టించాయి. మొత్తం తొమ్మిది చోట్ల ఉగ్ర క్యాంపులపై దాడులు చేశారు. అయితే ఇది ఆరంభం మాత్రమేనని..త్వరలో మరిన్ని దాడులు ఉంటాయని భారత్ ప్రకటించింది. ఉగ్రక్యాంపులపై పూర్తి ఖచ్చితమైన సమాచారంతోనే దాడులు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్తాన్ దృృష్టి మళ్లించి మరీ దాడి
భారత్ లో ఈ రోజు … సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. అందు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా హడావుడి చేసింది. అందరూ దీనిపైనే మాట్లాడుకున్నారు. కానీ అసలు పని మాత్రం.. పాకిస్తాన్ పై ఎటాక్. పాకిస్తాన్ కూడా మాకు భయపడుతున్నారని అందుకే సివిల్ మాక్ డ్రిల్ చేస్తున్నారని అనుకుంది కానీ.. ఎటాక్ చేయడానికి దృష్టి మరల్చుతున్నారని భావించలేకపోయింది.
స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ
ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. పహల్గాం దాడి ఘటన ప్రధాని మోదీని ఆవేదనకు గురి చేసింది. ఆ సమయంలో సౌదీ పర్యటనలో ఉన్న ఆయన వెంటనే తిరిగి వచ్చారు. అప్పటి నుంచి టెర్రరిస్టులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా రోజూ కీలకమైన వ్యక్తులతో సమావేశం అవుతూ ఆపరేషన్ సింధూర్‌కు ప్లాన్ చేశారు. అమలు చేశారు.
ధీటుగా బదులిస్తామన్న పాకిస్తాన్
ఈ దాడులను పాకిస్తాన్ ఖండించింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద సామాన్య పౌరులను టార్గెట్ చేసుకున్నారని ఆరోపించింది. భారత్ తమను యుద్ధం వైపుగా తీసుకెళ్తోందని ఆరోపించారు. ఈ దాడులను తిప్పి కొడతామనన్నారు. తమ దేశ సార్వభౌమత్వంపై భారత్ దాడి చేసిందని.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లఘిచిందని పాకిస్తాన్ అంటోంది.