ఓటీటీ ఒకప్పుడు కల్ప తరువుగా కనిపించింది. సినిమా మొదలైతే చాలు.. ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ రేట్లతో ఆకర్షించేసేవారు. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా ఓ పెద్ద మొత్తం గ్యారెంటీగా తిరిగి వస్తుందన్న నమ్మకం ఓటీటీలు కలిగించాయి. కొవిడ్ సమయంలో థియేటర్లు మూతపడిన వేళ.. ఓటీటీలే పెద్ద దిక్కుగా మారాయి. అయితే.. క్రమంగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఓటీటీ కబంద హస్తాల్లోకి చిత్రసీమ వెళ్లిపోవడం మొదలైంది. ఇప్పుడు పూర్తిగా ఓటీటీలు కబళించేశాయి. ఈ ఎఫెక్ట్ చిన్న సినిమాలపై ఎక్కువగా పడింది.
ఓటీటీలు కొంటున్నాయి కదా అని ఎడాపెడా సినిమాలు తీసేశారు. కొంత వరకూ వాటిని ఓటీటీల దగ్గర సేల్ చేయగలిగారు. ఓరకంగా చెత్త కంటెంట్ కొని..ఓటీటీలు కూడా నష్టపోయాయి. వాళ్లు తేరుకొని సినిమాల్ని ఎంచడం మొదలెట్టారు. దాంతో ఓటీటీల్ని నమ్ముకొని వచ్చిన సినిమాలు బేరాల్లేక, అమ్ముకోలేక అవస్థలు పడ్డాయి. పెద్ద సినిమాలు ఏదో రకంగా సేల్ అయిపోతాయి. మీడియం రేంజ్ సినిమాలు టాక్ బాగుంటే కొంటాయి. ఇక మధ్యలో నలిగిపోయింది చిన్న సినిమాలే.
ఓటీటీలు ఈ సినిమాల్ని ఎలాగూ కొనవు. కనీసం థియేటర్లో అయినా ప్రేక్షకులు చూస్తారా అంటే అదీ లేదు. `రెండు మూడు వారాల తరవాత ఓటీటీలో వస్తాయి కదా` అన్న ధీమా ప్రేక్షకులది. వాళ్లనీ తప్పు పట్టలేం. ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ పేరుతో ఏడాదికి సరిపడిన మొత్తం ఒకేసారి కట్టేసి ఉంటారు. ఆ డబ్బులు గిట్టుబాటు అవ్వాలంటే… థియేటర్‌కి వెళ్లడం తగ్గించాలి. పెద్ద హీరోల సినిమాలంటే ఎలాగూ వెళ్లక తప్పదు. చిన్న సినిమాలకు కూడా ఎలా టికెట్లు తెగ్గొడతారు? రివ్యూలు బాగున్నా, టాక్ బాగున్నా ఓటీటీలో వచ్చేంత వరకూ ఆగాలని ఆడియన్ ఫిక్సయిపోయాడు. అందుకే చిన్న సినిమాలకు ప్రేక్షకుల కరవు అవుతున్నారు.
ఈవారం విడుదలైన సుందరకాండ లేటెస్ట్ ఉదాహరణ. ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది. ఫన్ బాగా వర్కవుట్ అయ్యిందని, ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అని రివ్యూలు ఇచ్చారు. తీరా చూస్తే థియేటర్లో జనం లేరు. ఈవారం వచ్చిన ప్రతీ సినిమాదీ ఇదే పరిస్థితి. ‘పరదా’ దర్శకుడు ప్రెస్ మీట్ పెట్టి ‘మంచి సినిమా తీశాం… చూడండి’ అంటూ కన్నీరు పెట్టుకొన్నాడు. బార్బరిక్ దర్శకుడైతే ‘మంచి సినిమా తీసినా జనాలు ఎందుకు రావడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనని తాను చెప్పుతో కొట్టుకొన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
చిన్న సినిమాలు చూడకూడదని ప్రేక్షకులు ఫిక్సయిపోయారా? వాళ్లని థియేటర్లకు రప్పించలేమా? అని అడిగితే… దానికీ సమాధానాలు ఉన్నాయి. ఈరోజుల్లో పబ్లిసిటీ చాలా అవసరం. పబ్లిసిటీ అంటే రొటీన్ గా ప్రెస్ మీట్లు పెట్టి, ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు. సినిమాని జనంలోకి వెళ్లేలా ప్రచారం చేయాలి. సినిమా సోషల్ మీడియాలో కాదు.. జనం నోళ్లలో ఉండాలి. అలాంటి వెరైటీ పబ్లిసిటీ చేసుకోగలిగితే, ఓ సినిమా థియేటర్లలోకి వస్తోందన్న విషయం ప్రేక్షకులకు చేరవేయగలిగితే తప్పకుండా అటువైపు దృష్టి పడుతుంది. చివరికి ఎంత పబ్లిసిటీ చేసినా, మా సినిమా చూడండి అంటూ ఎంత అరచి గోల పెట్టినా.. సినిమాలో కంటెంట్ ఉండాల్సిందే. అది లేకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా వ్యర్థమే. ప్రేక్షకుల్ని రప్పించగలిగే కంటెంట్ కథలో ఉందా లేదా అనేది దర్శక నిర్మాతలు చూసుకోవాలి. ఆ తరవాత.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే మార్గాలు వెదుక్కోవాలి. ఈ రెండింటిలో ఏది తప్పినా… తప్పులో కాలేసినట్టే. ఆ తరవాత ప్రేక్షకుల్ని నిందించడంలో లాభం లేదు.