ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘకాలంగా పని చేస్తూ.. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన పీవీ సునీల్ కుమార్ విద్వేషంతో విచక్షణ కోల్పోతున్నారు. శాసనసభ్యుల క్రీడా పోటీలలో పాల్గొని ప్రమాదవశాత్తూ కింద పడిన రఘురామకృష్ణరాజు స్కానింగ్ రిపోర్టును సోషల్ మీడియాలో పెట్టి..అపహాస్యం చేశారు. మామూలుగా కింద పడితేనే ఇలా ఎముకలు విరిగాయి.. అదే తాము కస్టడీలో ఆయన చెప్పినట్లుగా కొట్టి ఉంటే.. ఎన్ని ఎముకలు విరిగి ఉండాలని ఆయన ప్రశ్నించారు.
పీవీ సునీల్ ది అతి తెలివో లేకపోతే పోలీసు తెలివో కానీ ఆయన ట్వీట్ పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాస్త డీసెన్సీ ఉండాలని ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారు. ఆయన గాయపడి చికిత్సపొందుతున్నారు.. ఇలాంటి సమయంలో సంబంధం లేని లాజిక్కులు చెబుతూ..గోప్యంగా ఉండాల్సిన ఆయన మెడికల్ రికార్డులను బహిరంగపరిచి మరో తప్పు చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసలు ఆయన బయట పెట్టిన మెడికల్ రికార్డులు ఎక్కడి నుంచి వచ్చాయో తేలాల్సి ఉంది.
నిజానికి పోలీసులు చేసే ధర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలియని వాళ్లు చాలా తక్కువ. పోలీసు దెబ్బలు అనే మాట అందుకే పాపులర్ అయింది. వారు కొట్టే దెబ్బలకు నరకం కనబడుతంది కానీ.. కాళ్లు, చేతులు విరగవు. తాము రఘురామరాజును కొట్టలేదని ఇలాంటి నేరేటివ్స్ ద్వారా నమ్మించాలని ప్రయత్నించడం కన్నా.. ఐపీఎస్ సర్వీస్ రూల్స్ ను గౌరవిస్తూ విచారణకు సహకరిస్తేనే ఎక్కువ విలువ ఉంటుంది. ఆ విషయం సునీల్ గుర్తించలేకపోతున్నారు.
