క్రికెట్‌ని బాగా ఇష్టపడేవాళ్ళకు పాకిస్తాన్ టీం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం గర్వించదగ్గ ఆటగాళ్ళు ఎందరో పాక్ టీంలో ఉంటారు. ప్రపంచంలోనే నంబర్ ఒన్ ఫాస్ట్ బౌలర్స్ చాలా మంది పాక్ నుంచే వచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, సెలక్టర్స్, ఆటగాళ్ళ రాజకీయాలకు, వ్యక్తిగత ద్వేషాలకు కాస్త కళ్ళెం వేసి ఉంటే పాకిస్తాన్‌ని ఓడించడం అగ్రశ్రేణి జట్లకు కూడా అసాధ్యమే. అంతటి ప్రతిభ వాళ్ళ సొంతం. అయినప్పటికీ తమ టీంని ఓడించే అవకాశాన్ని చాలా తక్కువ సార్లు మాత్రమే ప్రత్యర్థులకు ఇస్తూ ఉంటారు పాక్ ఆటగాళ్ళు. మేక్సిమం టైమ్స్ పాకిస్తాన్ బోర్డ్ రాజకీయాలు, చెత్త సెలక్షన్, ఆటగాళ్ళ మధ్య విభేదాలు, ఫిక్సింగ్ వ్యవహారాలు కలిసి పాకిస్తాన్‌ని ఓడిస్తూ ఉంటాయి.
పాకిస్తాన్ దేశం పరిస్థితి కూడా అంతే. ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడల్లా ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధం చేయాలని, పాకిస్తాన్‌ని చిత్తు చిత్తుగా ఓడించాలని చాలా మంది ఆవేశపడుతూ ఉంటారు కానీ అసలు పాకిస్తాన్‌ని ఒకరు ఓడించాల్సిన అవసరమే లేదు. ఆ దేశ పాలకులు, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులు పాకిస్తాన్‌ని, పాకిస్తానీయులను ఎప్పుడు గెలవనిచ్చారు కనుక. పుట్టిన మరుక్షణం నుంచి కూడా దిగ్విజయంగా ఓటమి బాటలో శరవేగంగా పయనిస్తున్న పాకిస్తాన్‌ని కొత్తగా ఒకరు ఓడించేది ఏముంటుంది? ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తల దాచుకున్నప్పుడే ఆ దేశాన్ని అసహ్యించుకున్నారు ప్రపంచ దేశాల ప్రజలు. ఈ రోజంతా సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అవుతూ ఉంది. ఓ పాకిస్తానీ బాలిక గన్ పేల్చడం, మోడీకి వార్నింగ్ ఇచ్చే దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియోతో ఏం చూపించాలనుకున్నారో తెలియదు కానీ చూసేవాళ్ళకు మాత్రం పాకిస్తాన్ దేశమన్నా, పాకిస్తానీయులన్న అసహ్యం కలగడం ఖాయం. పాకిస్తాన్లో పెరుగుతున్న బాలబాలికల జీవితాలపైన జాలి కూడా కలుగుతుంది. అయినా ఆర్మీ చెప్పు చేతల్లో ఉండే పాలకులు, ఉగ్రవాదుల చెప్పుచేతల్లో ఉండే ఆర్మీ…..ఇవి చాలవా పాకిస్తాన్‌ని పతనం చేయడానికి. ఇండియాని దెబ్బకొట్టాలన్న దురుద్ధేశ్యాలతో పాక్‌ని సపోర్ట్ చేస్తున్న చైనా లాంటి దేశాల విషయం పక్కన పెడితే, ఉగ్రవాదుల కంట్రోల్లో ఉన్న మరికొన్ని చిన్న దేశాలను పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ దేశంతో సంబంధాలకు సాహసించే దేశాలు ఎన్ని? పాకిస్తానీయులను నమ్మే పౌరులు ఎంతమంది? గ్లోబల్ సమాజంలో సంకుచిత, కుచ్చిత స్వభావం ఉన్న దేశాలు ఎప్పటికీ విజయం సాధించలేవు. పాకిస్తాన్ ఎప్పిటికీ విజేతగా నిలవలేదు.
కానీ ఇండియా మాత్రం విజేతగా నిలవగలదు. అభివృద్ధి చెందుతున్న దేశం అనే దశ నుంచి అభివృద్ధి చెందిన దేశం అనే స్థాయికి మనం చాలా సులభంగానే ఎదగగలం. గ్లోబలైజేషన్ పీరియడ్‌లో ఇప్పటి వరకూ మనం సాధించిన విజయాలన్నీ కూడా ఎక్కువ భాగం భారతీయుల వ్యక్తిగత నైపుణ్యం ఫలితమే. సాఫ్ట్ వేర్ రంగం అయినా ఇంకోటయినా ప్రతిభ ఉన్న భారతీయులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. భారతదేశ పేరు ప్రతిష్టలను మరి కాస్త ఇనుమడిస్తున్నారు. దేశంలో కూడా అలాంటి ప్రతిభ ఉన్నవారే చాలా చాలా గొప్ప విజయాలు సాధిస్తూ ఎంతోమంది సోదర భారతీయులకు అవకాశాలు కల్పిస్తున్నారు. అలాంటి వ్యక్తిగత నైపుణ్యాలకు తోడు………… సైన్యం కోసం కొనే శవ పేటికల్లో కూడా అవినీతికి పాల్పడే స్థాయి దగుల్బాజీ, దరిద్రపు రాజకీయ నాయకులు, పాలక వ్యవస్థలు, పోలీసు వారు కూడా ‘నాకేంటి?’ అనే స్వార్ధాన్ని పక్కన పెట్టి కాస్త దేశం గురించి కూడా ఆలోచిస్తే పాకి్స్తాన్ ఎప్పటికీ అందుకోలేనంత స్థాయికి ఇండియా దూసుకుపోతుందనడంలో సందేహం లేదు. భారతీయులలో ఆ స్థాయి సత్తా, సామర్ధ్యాలు ఉన్నాయని ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు.