ఆగస్టు 22న రాబోతున్న సినిమా ‘పరదా’. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఇది వరకే టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. ట్రైలర్లో కథేమిటి? కథలో సంఘర్షణ ఎందుకొచ్చింది? అనే విషయాలపై హింట్ ఇచ్చారు. ఓ ఊరి దురాచారాలకు సంబంధించిన కథ ఇది. అక్కడ ఆడపిల్లంటే ఎవరికీ మొహం చూపించకుండా, పరదా కట్టుకొని బతకాలి. అలాంటి చోట.. ఇంకెలాంటి దురాచారాలు ఉన్నాయి? వాటిని తట్టుకొని సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) పాత్ర ఎలా నిలబడగలిగింది? అనేదే కథ.
ఈ చిత్రానికి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. అనుపమ, సంగీతతో పాటుగా చాలా స్త్రీ పాత్రలు ఈ కథలో కీలకం కానున్నాయి. అవన్నీ దర్శకుడు చాలా స్ట్రాంగ్ గా రాసుకొన్నాడు.. ఓ బలమైన మెసేజీ ఇవ్వబోతున్నాడన్న సంగతి ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. గౌతమ్ మీనన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఆయన పాత్రేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. విజువల్స్ బాగున్నాయి. టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఈ చిత్రానికి దొరికింది. ముఖ్యంగా గోపీ సుందర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. కంటెంట్ కూడా బలంగా ఉంది. పబ్లిసిటీపై కాస్త దృష్టి పెడితే.. ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించవచ్చు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను ప్రారంభించేసింది చిత్రబృందం. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.