చిన్న సినిమాలకు అండ, దండగా ఉండే నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. ఈ సంస్థ సమర్పణలో మరో సినిమా వస్తోంది. అదే ‘పతంగ్’. ప్రణవ్ కౌశిక్, వంశీ పుజిత్, ప్రీతీ పగడాల ప్రధాన పాత్రలు పోషించారు. ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించారు. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈరోజు ట్రైలర్ బయటకు వదిలారు.
‘పతంగ్’ ఓ యూత్ ఫుల్ స్టోరీ. ఇద్దరి స్నేహితుల కథ ఇది. వారిద్దరి మధ్యలోకి ఓ అమ్మాయి వచ్చి చేరుతుంది. ఆ తరవాత ఈ ముక్కోణపు ప్రేమకథ ఏ తీరానికి చేరిందో…’పతంగ్’ లో చూడాలి. గౌతమ్ మీనన్, ఎస్.ఎస్.కాంచి, ఎస్.పి. చరణ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. నటీనటులు దాదాపు కొత్తవారే. సన్నివేశాలు, మాటలు, పాత్రల చిత్రీకరణ ఇవన్నీ సహజంగా అనిపించాయి. పతంగుల పోటీ కూడా అదేదో ఛాంపియన్ షిప్ అన్న రేంజ్లో చూపించే ప్రయత్నం చేశారు. పతంగుల పోటీకీ, ప్రేమకథకూ ఉన్న సంబంధం ఏమిటన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
25న బాక్సాఫీసు దగ్గర పోటీ మామూలుగా ఉండేట్టు లేదు. చాలా సినిమాలే పోటీ పడబోతున్నాయి. వాటిమధ్య ‘పతంగ్ ‘ ఎగరాలంటే కథ, కథనాల్లో దమ్ము ఉండాల్సిందే. మరి ఈ పోటీలో ‘పతంగ్’ ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి.
