జనసైనికుల్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని.. ఎవరు రెచ్చగొట్టినా దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ జనసేన నేతలకు సూచించారు. ఇటీవల కొన్ని ఘటనలు వివాదాస్పదమయ్యాయి. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు…మచిలీపట్నం వంటి చోట్ల దాడుల ఘటన జనసేన నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది.
మచిలీపట్నంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు పవన్ కల్యాణ్ ను బూతులు తిడుతూ వీడియో పెట్టారు. దాంతో జనసైనికులు ఆయనపై ఆవేశంతో దాడి చేసి క్షమాపణ చెప్పించారు. ఈ వీడియో వైరల్ కావడంతో కుల రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఇది రాజకీయ కుట్ర అని.. ఇలాంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పవన్ తాజాగా సూచనలు ఇచ్చారు. రెచ్చగొట్టేలా… అభ్యంతరకరంగా మాట్లాడేవారిపై, అందుకు కారకులైన వారిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి కానీ ఆవేశాలకు లోనై ఘర్షణకు తావీయవద్దని సూచించారు.
సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. తిట్టించడం ద్వారా రెచ్చగొడుతున్నారు. తొందరపడి మరో మార్గంలో వెళ్ళి ఘర్షణ పడటం ద్వారా సమస్య జటిలం అవుతోందని.. పవన్ గుర్తు చేశారు. సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్ రూపంలోనో, విశ్లేషకుల ముసుగులోనో రెచ్చగొట్టే వారినీ, అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారినీ భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలపాలని.. . వీరి వెనక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసేవారిపైనా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలని సూచించారు.
మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకి ఆదేశాలు ఇచ్చానని.. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు.