ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పాలనలో వేగం చూపిస్తున్నారు. ఇచ్చిన హామీలను రికార్డు స్థాయిలో నెరవేరుస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నెల రోజుల్లోనే అమలు చేస్తూ, శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు.
రూ. 20.77 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ఆధునికీకరణ పనులు కోనసీమ రైతులకు ఎంతో మేలు చేయనున్నాయి. గత పర్యటనలో రైతుల సమస్యలను స్వయంగా విన్న పవన్ కళ్యాణ్, 45 రోజుల్లోగా ఈ డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. అయితే, చెప్పిన గడువు కంటే 10 రోజుల ముందే నిధులను మంజూరు చేయించి, పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను కేవలం వినడమే కాకుండా వాటికి సత్వర పరిష్కారం చూపడమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ఈ డ్రెయిన్ ఆధునికీకరణ ద్వారా వేల ఎకరాల సాగు భూమికి మురుగు నీటి ముప్పు తొలగిపోవడమే కాకుండా, కొబ్బరి తోటల దిగుబడిపై సానుకూల ప్రభావం చూపుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
