ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఓ శక్తిగా తనను తాను ఊహించుకుంటున్నారు. కానీ రాజకీయవర్గాల్లో మాత్రం..ఆ ఫీలింగ్ రావడం లేదు. దానికి కారణం.. ఆయన సీరియస్ నెస్ లేని రాజకీయమే. వ్యక్తిగత విమర్శలు చేసుకుని.. పుస్తకాల్లో కనిపించే విచిత్రమైన పదాలతో విమర్శలు చేసినా… ఆవేశ పడటమే రాజకీయం అనే భ్రమలో ఉన్నారు. కానీ అసలు రాజకీయం చేయాలంటే.. పార్టీ అనేదానికి ఓ రూపు ఉండాలనే సంగతిని మర్చిపోయారు.
పార్టీ అధ్యక్షుడు సరే…! మిగతా వాళ్ల సంగతేంటి..?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ! ఓకే..! మరి నాదెండ్ల మనోహర్ పొజిషన్ ఏమిటి..? ఇప్పుడు పవన్ కల్యాణ్ కన్నా.. జనసేన కార్యక్రమాలను నాదెండ్లనే ఎక్కువ చూస్తున్నారు. కానీ ఆయనకు అధికారిక పదవి ఏమీ లేదు. ఓ రాజకీయ పార్టీ వ్యవస్థ ఎలా ఉండకూడదనేది… జనసేనను బట్టి చూస్తే అర్థమైపోతుంది. మూడు నెలలు ముందుగా ఎన్నికలు వచ్చిన కారణంగా.. ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నామన్న కారణం చెప్పి… తెలంగాణ ఎన్నికల నుంచి తప్పించుకున్న జనసేన.. ఏపీలో అలాంటి కారణాలు చెప్పడానికి కూడా అవకాశం లేదు. అలా అని… ఏపీలో సన్నద్ధం అయ్యారా అంటే అదీ లేదు. ఎక్కడా కూడా పార్టీ నిర్మాణం సరిగా లేకపోవడం, నేటి వరకు జిల్లా కార్యవర్గాలను కూడా నియమించకపోవడం .. రాజకీయాలపై పవన్ కల్యాణ్ అవగాహనా లేమికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
Click here for : ఎలక్షన్ కౌంట్‌డౌన్ 60 : సమర సన్నాహాల్లో టీడీపీ ముందడుగు వేసిందా..?
అభ్యర్థులను ఎలా ఖరారు చేసుకుంటారు..?
వైసీపీలో టిక్కెట్ ఇవ్వలేదని… జనసేనలో చేరిన పితాని బాలకృష్ణ అనే నేతకు… ముమ్మిడి వరం అసెంబ్లీ టిక్కెట్ ను ఖరారు చేశారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత అభ్యర్థులపై ఇంత వరకూ దృష్టి పెట్టిన పాపాన పోలేదు. ఐదేళ్ల కాలంలో.. కొన్ని జిల్లా పర్యటనలు కూడా పూర్తి చేయలేదు. ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వాళ్లు వస్తే చేర్చుకుంటున్నారు తప్ప…వారి పార్టీకి ఎంత మేర ఉపయోగపడతారన్న అంశంపై సమీక్షల్లేవు. పార్టీ తరపున ఏమైనా కార్యక్రలు చేపట్టేది లేదు. పవన్ కవాతు చేస్తే చేసినట్లు లేకపోతే లేదు. ఎవరో ఒకరికి బీఫామ్ ఇచ్చి అభ్యర్థుల్ని నిలబెట్టడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఇలా నిలబెట్టే అభ్యర్థులు.. కనీస పోటీ కూడా ఇవ్వకపోతే… పోయేది.. పవన్ కల్యాణ్ పరువే. ఆ విషయం తెలియకుండా పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఉండరు. అయినప్పటికీ.. ఎలాంటి ముందస్తు కసరత్తు లేదు.
పొత్తులపై నాన్చుడు ఎందుకు..?
175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ పదే పదే ప్రకటిస్తూంటారు. కానీ ఆయన, ఆయన పార్టీ కార్యాచరణ మాత్రం.. దానికి భిన్నంగా ఉంటుంది. ఇప్పటికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన ల మధ్య పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీలు కూడా ఈ ప్రచారాన్ని పూర్తిస్థాయిలో ఖండించడం లేదు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా తెలంగాణలో టి.ఆర్.యస్, ఆంధ్రాలో వైసీపీ, జనసేన, కలిసి పని చేస్తాయని కొత్తగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని కూడా ఖండించలేని పరిస్థితిలో ఆ పార్టీలు ఉన్నాయి. సీపీఐ ఇప్పటికే జనసేనతో కలిసి పని చేస్తుండగా, సీపీఎం మాత్రం ఎన్నికల నాటి పరిస్థితులను ఇప్పుడే చెప్పలేమంటుంది. అయితే ఈ రెండు పార్టీలు మాత్రం పవన్ తో కలిసి పోటీ చేస్తామని పదే పదే చెబుతున్నాయి. కానీ.. పవన్ నుంచి స్పందన లేదు.
ఎన్నికలంటే.. ఓట్లేసే ప్రజలు మాత్రమే కాదు. దానికో వ్యవస్థ ఉంటుంది. విజయం సాధించాలంటే.. పోలింగ్ బూత్ లెవల్లో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అది లేకపోతే ప్రజలు ఓట్లేయాలని అనుకున్నా… ఓట్లేయించుకోలేరు. ఆ విషయం పవన్ కు అర్థమయ్యేలోపు పుణ్యకాలం గడిచిపోతుంది. ఇప్పటి వరకూ పవన్ వేగాన్ని చూస్తే…సన్నద్ధత లేని కారణంగా.. అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేయలేకపోతున్నామన్న ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు..!
–సుభాష్