పోరాటయాత్రలో పోరాటమా..? ఆరాటమా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు పోరాటయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించారు. నిజానికి గత అక్టోబర్‌ నుంచే ప్రజల్లో ఉంటానని చెప్పిన పవన్.. దాదాపుగా ఆరేడు నెలల ఆలస్యంగా కార్యాచరణ ప్రారంభించారు. దీనికి ఏమైనా ప్లానింగ్ ఉందా అంటే అదీ లేదు. మొదట ఇచ్చాపురం నుంచి ప్రారంభించారు అంతే. గాలి ఎటు పోతే అటు అన్నట్లుగా సాగిపోవాలన్నట్లుగా రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. తొలి రోజు ఇచ్చాపురం బహిరంగసభను .. మీడియా కవరేజీ బాగానే ఉచ్చింది. గతంలో మీడియాతో సున్నం పెట్టుకున్నా..ఓ రాజకీయ పార్టీ నేతగా..ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తామని దీంతో మీడియా చెప్పినట్లయింది.

ఇచ్చాపురంలో సభలో పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని చూస్తే.. ఆయనలో పోరాటం కన్నా ఆరాటమే ఎక్కువగా కనిపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను సరికొత్త రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. నిజానికి పవన్ కల్యాణ్ తన పార్టీలోనే ఇంత వరకూ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోయారు. పార్టీ ప్రారంభించి నాలుగేళ్లయింది. తన పార్టీలో తాను తప్ప కనిపించేవారు లేరు. బీజేపీ నుంచి అధికార ప్రతినిధుల్ని, వ్యూహకర్తల్ని తెచ్చి పెట్టుకున్నారు. కొత్తగా వైసీపీ నుంచి తోట చంద్రశేఖర్ అనే మాజీ ఆలిండియా సర్వీసుల అధికారి, రియల్ ఎస్టేట్ వ్యాపారిని తెచ్చుకుని పార్టీకి ప్రధాన కార్యదర్శిని చేశారు. నిజానికి ఈయన పీఆర్పీతోనే రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత వ్యవస్థ లేదు. ఎంపిక శిబిరాలు నిర్వహించారు. వాటినేం చేశారో తెలియదు. కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థనే మార్చేస్తానంటున్నారు.

ప్రత్యేకహోదా విషయంలోనూ అదే దాటవేత ధోరణి. తానే మొదటగా ప్రత్యేకహోదా డిమాండ్ ను వినిపించానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అది నిజమే. కానీ అసలు వేడి మీద ఉన్న ప్పుడు ఎందుకు సైలెంట్ కావాల్సి వచ్చిందో మాత్రం వివరణ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కవాతులు చేస్తానమంటున్నారు. టీడీపీ చేస్తున్న ధర్మపోరాట దీక్షల్ని మాత్రం తేలికగా తీసుకున్నారు. వాళ్లూ పోరాడుతున్నదిి ప్రత్యేకహోదా కోసమే అయితే సపోర్ట్ చేస్తే పోయేదేముంది..?. పైగా మోదీకి తానేం భయపడటం లేదని… చంద్రబాబే భయపడుతున్నారని.. అచ్చంగా వైసీపీ నేతలు చేసే… రివర్స్ ఎటాక్‌ను ఎంచుకున్నారు. నిజానికి ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంది కదా..! ప్రత్యేకంగా దీన్ని కెలకడం ఎందుకు..!
ఇచ్చాపురంలో కొత్తగా… పవన్ కల్యాణ్ అధికార ఆకాంక్షను బయపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటారు. దాంట్లోనైనా కాన్ఫిడెంట్‌గా చెప్పారా అంటే అదీ లేదు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామంటారు. మళ్లీ తనకు ఐదు మంది ఎమ్మెల్యేలు చాలంటూ.. మళ్లీ మరో మాట చెప్పారు. చివరికి..తన జేఎఫ్‌సీ విషయంలోనూ అదే తరహా ఆరాటం కనిపించింది. తాను జేఎఫ్‌సీ ఏర్పాటు చేసి.. కేంద్రం నుంచి 74 వేల కోట్లు రావాలని తేల్చితే.. టీడీపీ, వైసీపీ పట్టించుకోలేదని మండిపడ్డారు. వాళ్ల సంగతి సరే.. ముందు పవన్ కల్యాణ్ పట్టించుకున్నారా..? ఆయన పట్టించుకోవడం లేదనే.. జయప్రకాష్ నారాయణ కొత్త కమిటీని నియమించుకున్నారు కదా..! మొత్తంగా పవన్ కల్యాణ్ తన రాజకీయాల్లో ఆరాటం తప్ప… పేరుతో చెప్పినట్లు పోరాటం చూపించలేకపోతున్నారన్నదే మెజార్టీ భావన.

– సుభాష్‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com