కాంగ్రెస్ కూటమి సభగా కుమారస్వామి ప్రమాణ స్వీకార వేడుక…!?

కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల తర్వాత ఒక ఉత్సాహభరితమైన వాతావరణం కనిపిస్తోంది. 78సీట్లు గెలిచినా.. పొత్తులో భాగంగా ముఖ్యమంమత్రి సీటును కుమారస్వామికి ఇచ్చేస్తున్నా.. ఆ పార్టీకి అంతకు మించిన లాభం.. జాతీయ రాజకీయాల్లో కలుగుతోంది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్రమోదీని ప్రధాని కానీయకూడదని తీర్మానించుకున్న ప్రాంతీయ పార్టీలన్నీ కుమారస్వామి ప్రమాణ స్వీకార సభ ద్వారా ఒకే వేదిక మీదకు వస్తున్నాయి. దీనికి సోనియా, రాహుల్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అంటే.. ఒక రకంగా.. వీరంతా పరోక్షంగా కాంగ్రెస్ కూటమి అనే భావించవచ్చు.

నిజానికి చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. అందుకే నాయకత్వం అనే ప్రశ్నే రాకుండా.. నరేంద్రమోదీపై పోరాటం అనే కాన్సెప్ట్ ద్వారానే ప్రస్తుతానికి ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట్ల.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నది చాలా తక్కువ చోట్లే. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో కాంగ్రెస్ పొత్తు ఖాయం, బెంగాల్‌లో తృణమూల్‌ కూడా కాంగ్రెస్‌తో వెళ్లడం ఖాయమవుతోంది. తమిళనాడులో డీఎంకేతో ఇప్పటికే కాంగ్రెస్‌తో కలసి నడుస్తోంది. ఆంధ్ర లాంటి మిగతా రాష్ట్రాల్లో పొత్తులనే ప్రశ్నే రాదు. కానీ ఏపీ కోసం.. చంద్రబాబు అనుకూలమైన ప్రభుత్వం రావాలంటే… అవసరం అయితే కాంగ్రెస్ కూటమికి మద్దతివ్వడానికి కూడా వెనుకాడకపోవచ్చు.

నిజానికి కాంగ్రెస్ ప్రాభవం రాను రాను దిగజారిపోతోంది. కానీ హిందీ రాష్ట్రాలు.. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మాత్రం ఉనికి కాపాడుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా అధికారం అనే మాట అసాధ్యమే. ఆ విషయం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికీ తెలుసు. ప్రాంతీయ పార్టీల మద్దతు ఉన్న జాతీయ పార్టీకే భవిష్యత్ ఉంటుందని అంచనా వేసుకున్నారు. బీజేపీ చేజేతులా అందర్నీ దూరం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది. నాయకత్వం సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఐక్యమత్యంగా పోరాడి… మోదీని దించేద్దాం అన్న కాన్సెప్ట్‌తో కుమారస్వామి ప్రమాణ స్వీకార సభ హైలెట్ అయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com