జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత నిధుల్ని ఉదారంగా ప్రజాసేవకు కేటాయిస్తూంటారు. అలా కడపలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం స్మార్ట్ కిచెన్ కోసం కేటాయించిన నిధులతో విద్యార్థుల కడుపు నిండుతోంది. కడపలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కోసం ఓ స్మార్ట్ కిచెన్ ను నిర్మించారు. ఈ కిచెన్ ప్రతి రోజు పన్నెండు గవర్నమెంట్ స్కూల్స్‌కి, 2200 మంది విద్యార్థులకు ఈ క్యాంటీన్ నుంచి భోజనం వెళ్తోంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని యాప్ లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయవచ్చు. ఇలాంటివే మరో నాలుగు స్మార్ట్ కిచెన్స్ సిద్ధమవుతున్నాయి.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ గత ఏడాది కడపలోని పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి వెళ్లినప్పుడు జిల్లా కలెక్టర్ స్మార్ట్ కిచెన్ ఆలోచన చెప్పారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారం తన వ్యక్తిగత నిధుల నుంచి అందించానని పవన్ తెలిపారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో ‘స్మార్ట్ కిచెన్’ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి నుంచే 12 పాఠశాలలకు ఆహారం సిద్ధమవుతుంది. న్యూట్రిషియన్ల సలహాలు పాటిస్తూ పోషక విలువలతో, రుచికరమైన ఆహారాన్ని వండి వార్చే కుక్స్, సహాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ కిచెన్ కచ్చితంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదే స్మార్ట్ కిచెన్ కాన్సెప్ట్ ను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. ప్రభుత్వ నిధులతో ఎక్కడికక్కడ స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి.. మధ్యాహ్న భోజనంలో క్వాలిటీని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పేరెంట్, టీచర్స్ మీటింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ.. విద్యార్థులకు పోషకారం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.