ప్రొ.నాగేశ్వర్ : 2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎంత..?

2019లో పవన్ కల్యాణ్ ఏ స్థాయిలో ప్రభావం చూపించగలగుతారు…? ఏ పార్టీపై ఎక్కువ ప్రభావం చూపిస్తారనేది.. రాజకీయవర్గాల్లో విస్త్రతంగా చర్చనీయాంశమవుతున్న అంశం. గతంలో పవన్ కల్యాణ్ 2018 తర్వాత తన బలమెంతో తెలుస్తుందని చెప్పారు. ఇటీవలి కాలంలో… పవన్ కల్యాణ్ తాను ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటనలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వారు ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకాన్ని వ్యక్తం చేయాల్సిందే. అందులో తప్పు లేదు. కానీ నిజంగా పవన్ కల్యాణ్ ప్రభావం ఎంత ఉండవచ్చు అనేది.. ఇప్పుడు లెక్కించడం కష్టమే. ఎన్ని సీట్లు వస్తాయి..? ఎన్ని ఓట్లు వస్తాయి అన్న విషయాలను మనం ముందుగా అంచనా వేయలేం. కానీ కొన్ని ఫ్యాక్టర్స్‌ను అంచనా వేయవచ్చు.

1. టీడీపీ వర్సెస్ వైసీపీ అనే పొలరైజేషన్‌ను దెబ్బ తీస్తారా..?
ఒకటి ఏమిటంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ముఖాముఖి పోరుగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబునాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డిల మధ్యే కుస్తీపోటీల్లా పరిస్థితి ఉంది. గత ఎన్నిక్లలో బీజేపీ, జనసేన టీడీపీతో పొత్తులో ఉన్నా.. ఈ సారి మాత్రం.. విడిపోయాయి. కాంగ్రెస్ పార్టీని జనం దగ్గరకు తీసుకోవడం లేదు. బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. వామపక్షాలు బలహీనంగా ఉన్నాయి. జనసేన పార్టీ ఈ పొలరైజేషన్‌ను దెబ్బతీస్తుందా అనేది ముఖ్యం. ఈ పొలరైజేషన్‌ను దెబ్బతీస్తే..ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది ప్రయోజనం. ప్రజలకు చాయిస్ పెరుగుతుంది. ఓటర్లకు ఎన్ని ఎక్కువ చాయిస్‌లు ఉంటే.. అది సుసంపన్నమైన ప్రజాస్వామ్యానికి సూచిక. రెండు పార్టీల వ్యవస్థ అని కొంత మంది చెబుతూంటారు. వాళ్లు కాకపోతే..వీళ్లు అన్నట్లు ఉంటుంది పరిస్థితి. కానీ మూడో, నాలుగో ఆప్షన్స్ కూడా ఉంటే ప్రజాస్వామ్యానికి మంచిది. ఇలా ప్రత్యామ్నాయంగా జనసేన ఎదగలేకపోతోంది.

2. పీఆర్పీలా ఓ ఫోర్స్‌గా జనసేన రాగలదా..?
గతంలో ప్రజారాజ్యం పార్టీ… చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, వైఎస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ పడి… 18 అసెంబ్లీ సీట్లు, 71 లక్షల ఓట్లను సాధించింది. ఓ రకంగా చిరంజీవి షేక్ చేశారు. అంటే బలమైన ప్రత్యామ్నాయంగా వచ్చినట్లే. కానీ తర్వాత ఆ పార్టీని నిలుపులేకపోయారు. అది వేరే విషయం. అప్పట్లో పీఆర్పీ సాధించినట్లుగా ఇప్పుడు జనసేన సాధించగలదా..? ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు నుంచి పది శాతం ఓట్లు వరకూ జనసేన సాధించే అవకాశం ఉంది. ఇది ఇప్పటి పరిస్థితి. పది నెలల్లో ఏం జరుగుతుందో చెప్పలేము. 2012 ఉపఎన్నికల్లో జగన్ భారీ విజయాలను నమోదు చేశారు. కానీ 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే నామమాత్రమైన ప్రభావాన్నే జనసేన చూపించగలదు. 2019లో జనసేన తాను గెలవకపోవచ్చు.. ఎవరో ఒకరికి ఓటమి కారణం కావొచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య రెండు శాతం మాత్రమే ఓట్ల తేడా. జనసేనకు వస్తాయని భావిస్తున్న ఐదు నుంచి పది శాతం ఓట్లు… కచ్చితంగా వేరే పార్టీ ఓటమికి కారణం అవుతుంది. గతంలో లోక్‌సత్తా పోటీ చేసినప్పుడు ఓట్లు చీలాయి. లోక్‌సత్తా వల్లే ఓడిపోయామని టీడీపీ ఆరోపించింది. అది కరెక్ట్ అర్థమేటిక్ కాదు. అలాగే జనసేన.. పుట్టింది.. తెలుగుదేశం పార్టీని ఓడించడానికో.. గెలిపించడానికో కాదు. వారి రాజకీయాలు వారు చేసుకోవడానికి ..!

3. మిత్రులను కలుపుకునే ప్రయత్నం చేస్తారా..?
జనసేన ముందు ఉన్న మరో సవాల్ మిత్రులను కలుపుకోవడం..!. రాజకీయాల్లో స్వయంగా మేజర్ ప్లేయర్ కానప్పుడు..మిత్రుల్ని కలుపుకోవడం రాజకీయాల్లో సహజం. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ అవే చేస్తున్నాయి. కానీ జనసేన ఆ పని చేస్తుందా..? నిజానికి 2014లో జనసేన .. వైసీపీకి మద్దతిస్తే గెలిచి ఉండేది. ఆ మాటకొస్తే… వామపక్షాలు కలిసినా వైసీపీ ఆ రెండు శాతం ఓట్లు కలిసి ఉండేవి. కానీ జగన్ ఆ ప్రయత్నం ఎక్కడా చేయలేదు. కానీ ఇప్పుడు జనసేన అధినేత అలాంటి ప్రయత్నాలు చేస్తారా..? వామపక్షాలతో కలిసి.. జనసేన పోరాటం చేస్తోంది. కలసి పోటీ చేసే వాతారవణం ఉంది. కానీ.. పవన్ కల్యాణ్ అలాంటి సూచనలు ఏమీ ఇంకా ఇవ్వలేదు. కానీ ఇద్దరూ కలిస్తే..జనసేనకు రెండు శాతం ఓట్లు కాదు.. ఇంకా ఎక్కువే కలుస్తాయి. స్వింగ్ ఓటు కలుస్తుంది. ప్రతి పార్టీకి కొంత లాయల్ ఓటు.. ఉంటుంది. స్వింగ్ ఉంటుంది. గెలుస్తారన్న అభిప్రాయం ఉంటే.. ఆ స్వింగ్ ఓటు వారి వైపు వెళ్తుంది. బీజేపీ, కాంగ్రెస్‌తో కలవబోమని జనసేన చెబుతోంది. టీడీపీతో పోరాడుతోంది. వైసీపీతో కలిసే చాన్స్ లేదు. ఉంటే చాన్స్ ..వామపక్షాలతోనే కలిసే అవకాశం ఉంటుంది. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నా… జనసేన అధినేత చొరవ చూపించడం లేదు. ఎన్నికల ముందు కలిసినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

4. పార్టీ నిర్మాణం గురించి పట్టించుకోరా..?
జనసేన పార్టీ నిర్మాణం అసలు జరగడం లేదు. పార్టీ నిర్మాణం ఎలా అనేది… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ను చూసి నేర్చుకోవాలి. అమిత్ షా ఏపీ పర్యటనకు వస్తే.. ఏపీ అధ్యక్షుడితో మాట్లాడరు. బూత్ కమిటీల మీటింగ్‌ను ఏర్పాటు చేయమంటారు. వారితోనే మాట్లాడతారు. ఈ బూత్ కమిటీల్లో ఉండేవారు.. నిరంతరం ఆయా పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ఓటర్లతో టచ్‌లో ఉండి పార్టీ వైపు తిప్పుకుంటారు. ఆ రకమైన ప్లానింగ్ జనసేనలో ఎక్కడా కనిపించడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో తెలియదు. పవన్ కల్యాణ్‌ కు ఓటు చేయడం వేరు.. పవన్ కల్యాణ్ పెట్టిన అభ్యర్థికి ఓటు వేయడం వేరు. ఓ చిన్న పార్టీకి.. ముందుగా అభ్యర్థులు ప్రజలకు పరిచయం అయి ఉండటం మంచిది. కానీ జనసేనలో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. జనసేన కార్యక్రమాల్లో ఒక్క పవన్ కల్యాణ్ తప్ప ఇంకెవరూ మాట్లాడరు. జనసేనలో ఐదారుగురు గుర్తింపు ఉన్న.. నేతలెవరూ లేరు. జిల్లా, మండల స్థాయిలో కూడా పార్టీ నిర్మాణం లేకుండా.. ఎవరైనా ఓట్లు వేయడం సాధ్యమా..?

5. హెలికాఫ్టర్ పాలిటిక్స్ తో జనసేనకు లాభం ఏమిటి..?
పవన్ కల్యాణ్ ప్రస్తుతం హెలికాఫ్టర్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే .. ఏదైనా ఓ విషయం తీసుకుంటే..దానిపై పోరాటం చేసి.. వేళ్లిపోవడం. ఇలా కాకండా..నిరంతరం… రాజకీయాలు చేస్తూండాలి. అందుకే… పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ అని విమర్శిస్తూంటారు. అంటే.. రాజకీయాలు అనేది.. పార్ట్ టైమ్ వ్యవహారం కాదు.. నిరంతం… జనంలో ఉండాలి. నిజానికి పవన్ కల్యాణ్ ఏ స్థానిక విషయాలను టేకప్ చేయలేదు. టేకప్ చేశారు. శ్రీకాకుళం వెళ్లారు.. ఉద్దానం సమస్యను ఎత్తుకున్నారు. వదిలేశారు. తర్వాత రకకాల చోట్లకు వెళ్తున్నారు. కానీ విధానపరంగా… ఏ అంశాలపై పోరాటం చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు.

6. జనసేనకు కంటిన్యూటీ ఉందా..?
ఏదైనా ఓ అంశంపై పోరాటం చేస్తున్నప్పుడు దానికి ముందు వెనుక యాక్టివిటీ ఉండాలి. ఓ నిర్దిష్టమైన సమస్యలపై నిరంతరం పోరాడితే తప్ప.. ప్రజలు ఎట్రాక్ట్ కారు.ఇక్కడ కంటిన్యూటీ కూడా ఉండాలి. ఉద్దానం విషయంలో జనసేన కొంత కంటిన్యూటీ మెయిన్‌టెయిన్ చేసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విధానాలు, సమస్యలపై… ఓ కంటిన్యూటీని కొనసాగించలేకపోతోంది. కొన్ని అంశాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశ్చర్యకమైన సెలైన్స్ పాటిస్తూంటారు. కొన్ని అంశాలపై.. అసలు మాట్లాడకపోవడమో..కొద్దిగా మాట్లాడి వదిలి పెట్టడమో జరుగుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద..ఏపీలో చాలా పెద్ద రగడ జరుగుతోంది. కానీ పవన్ కల్యాణ్ దీని గురించి మాట్లాడలేదు. పవన్ మాట్లాడితే..కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ పవన్ కల్యాణ్ అశ్చర్యకరంగా మౌనం పాటిస్తున్నారు.

7. సామాజిక సమీకరణాల లెక్కలు తేల్చుకోగలరా….?
ఇక సోషల్ ఇంజినీరింగ్ కూడా జనసేనకు ముఖ్యమే.. అంటే కులాల సమీకరణ. ఏపీలో… ఏ పార్టీ వెనుక ఏ కులం ఉందో.. అందరికీ తెలుసు. పవన్ వెనుక కాపు సామాజికవర్గం ఉందన్న అభిప్రాయం ఉంది. కానీ ఈ కాపు సామాజివర్గం ఓట్లను కన్సాలిడేట్ చేసేందుకు పవన్ కల్యాణ్ ఇంత వరకూ ప్రయత్నం చేయలేదు. 30,40 నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్దేశించగలిగే పరిస్థితుల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో వీరంతా టీడీపీకి ఓటు వేశారు. ఇప్పుడు కొత్త షిఫ్ట్ అవుతోంది. ఈ ఓటర్లందరినీ.. పవన్ కల్యాణ్ ఆకర్షించగలిగితేనే ప్రయోజనం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]