గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రాత మారుస్తున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుండి దశాబ్దాలుగా మాటల్లోనే ఉండిపోయిన పనుల్ని చేతల్లోకి తెచ్చేందుకు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. వాటిలో చాలా వరకూ ప్రారంభమవుతున్నాయి. శంకర్ విలాస్ రైల్వే వంతెన స్థానంలో కొత్తది..విశాలమైనది కట్టాలని పాతికేళ్లుగా డిమాండ్ ఉంది. ఇప్పటికి పెమ్మసానితో అది సాకారం అవుతోంది.
డిజైన్లు, టెండర్లు అన్నీ పూర్తయి పనులు ప్రారంభమయింది. వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రజల ట్రాఫిక్ కష్టాల్ని తీర్చాల్సి ఉంది. ఇక పొన్నూరు రోడ్ తో పాటు.. మిర్చియార్డ్ వద్ద కూడా ఫ్లైఓవర్లను మంజూరు చేయించారు. వాటి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్ని చేశారు. కానీ వాటిని వినియోగంలోకి తేవాల్సిన ఉంది. ఆ పని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టకుండానే ప్రజలకు సమస్యలుగా మారిన అనేక సమస్యలను పరిష్కరించవచ్చని.. ప్రతీదానికి నిధులతో పని ఉండదని ఎన్నికల ప్రచారంలో పెమ్మసాని చెబుతూ ఉండేవారు. ఆ మాటల్ని ఆయన కేంద్ర మంత్రి అయినా.. ఎంతబిజీగా ఉన్నా మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చే సూచనలతో పాటు.. తన పరిశీలనలో బయటపడిన సమస్యలనూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.