మచిలీపట్నంలో గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు అధికారులే లక్ష్యంగా చేస్తున్న హడావుడి చర్చనీయాంశంగా మారింది. గురువారం కొన్ని కాలనీల్లో అక్రమ కబ్జాల తొలగింపునకు వెళ్లిన అధికారులపై వీరిద్దరూ వేర్వేరుగా విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో తమ అండ చూసుకుని సాగించిన ఆక్రమణలను తొలగిస్తుంటే మొదట రంగంలోకి దిగిన పేర్ని కిట్టు తనదైన శైలిలో బాడీ లాంగ్వేజ్‌తో సీఐ స్థాయి అధికారిని దూషించగా, ఆ తర్వాత పేర్ని నాని మీడియా ముందుకొచ్చి డిప్యూటీ తహసీల్దార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేము అధికారంలోకి వచ్చాక ఇదే పోలీసులతో నీ ఇల్లు కూలగొట్టిస్తా అంటూ ఆయన బహిరంగంగా హెచ్చరించడం చూసి, బందరు ప్రజలు వీరికి బీపీ పెరిగిపోయి ఇలా మాట్లాడుతున్నారా అని జాలి పడుతున్నారు.
అధికారులను బెదిరించడంలో పేర్ని నాని ఏకంగా సరిహద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సదరు అధికారి ఒకవేళ తెలంగాణకు బదిలీపై వెళ్లినా వదిలే ప్రసక్తే లేదని, అక్కడ కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా సరే వాళ్లతో నీ ఇల్లు కూలగొట్టిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి మేము వస్తాం.. మీ సంగతి తేలుస్తాం” అంటూ ఉద్యోగులపై పడి ఏడవడమే పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి బెదిరింపుల వల్ల పనులు ఆగుతాయని భ్రమపడుతున్నారని స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. తండ్రీకొడుకుల ఈ అతి ప్రవర్తన అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అధికారులపై విరుచుకుపడటం సంప్రదాయంగా మారిందని, ఇలాంటి వారికి గట్టిగా ట్రీట్మెంట్ ఇస్తేనే దారికి వస్తారని మచిలీపట్నం ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంది. గతంలో తమ మాట విన్న వారే ఇప్పుడు చట్ట ప్రకారం పనులు చేస్తుంటే తట్టుకోలేక, భవిష్యత్తులో ఏదో చేస్తామని పగటి కలలు కంటున్నారని జనం ఎద్దేవా చేస్తున్నారు. కబ్జాల తొలగింపు వంటి ప్రజాహిత పనులను అడ్డుకుంటూ అధికారుల వ్యక్తిగత జీవితాలపై శాపనార్థాలు పెట్టడం చూస్తుంటే, పేర్ని కుటుంబం రాజకీయంగా ఎంతటి అసహనానికి గురవుతుందో అర్థమవుతోందని సెటైర్లు వేస్తున్నారు.
