పోల‌వ‌రంపై భాజ‌పా నిబ‌ద్ధ‌త అంత ఉందట!

పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్రం వైఖ‌రిని టీడీపీ త‌ప్పుబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. తాజా ప‌రిస్థితి నేప‌థ్యంలో ఏపీ భాజ‌పా నేత‌లు ఏం చేస్తున్నార‌నే చ‌ర్చ కూడా మ‌రోప‌క్క జ‌రుగుతోంది. ఇది జాతీయ ప్రాజెక్టు కాబ‌ట్టి, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్య‌త కేంద్రంపైనే ఉంటుంద‌నీ, ఆల‌స్యం అవుతుండ‌టానికి కార‌ణం కేంద్రం వైఖ‌రే అనే అభిప్రాయాన్ని టీడీపీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయంగా చూసుకున్నా పోల‌వ‌రం కోసం చంద్ర‌బాబు నాయుడు ప‌డుతున్న క‌ష్టాన్ని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌నే భావాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డానికి టీడీపీకి మ‌ద్ద‌తుగా నిలిచే మీడియా కూడా ప్ర‌య‌త్నిస్తోంది. అంతేకాదు, పోల‌వ‌రం పూర్తి కాక‌పోతే భార‌తీయ జ‌న‌తా పార్టీపై ఏపీ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌నే విశ్లేష‌ణ‌లు చేసేస్తున్నారు! ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ నేత‌, భాజ‌పా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఓ ఛానెల్ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. పోల‌వ‌రంపై భాజ‌పాకి ఉన్న నిబ‌ద్ధ‌త ఇదీ అంటూ గ‌తాన్ని గుర్తుచేశారు.
పోల‌వ‌రం ప్రాజెక్టును 2005లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రారంభించార‌నీ, 2011 నుంచి తెలంగాణ ఉద్య‌మం వ‌చ్చింద‌నీ అక్క‌డి నుంచే పోల‌వ‌రంపై స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయ‌ని సోము వీర్రాజు చెప్పారు. అదే స‌మ‌యంలో, తెలంగాణలోని అన్ని పార్టీల నేత‌లూ క‌ల‌సి.. పోల‌వ‌రం డామ్ ఎత్తు త‌గ్గించాల‌నీ, లేదంటే రాజ‌మండ్రి ముగినిపోతుంద‌నీ, ఇలాంటి అనుమానాల‌ను ఆంధ్రా నేత‌ల‌తో వారు మాట్లాడించేవార‌న్నారు. ఇలా అనేక ఇబ్బందులు చోటు చేసుకున్న స‌మ‌యంలో భాజ‌పా ఓ నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. అంత‌ర్గ‌తంగా తాము కిష‌న్ రెడ్డితో గ‌వ‌ర్న‌ర్ తో నాడు పోరాటం చేశామ‌న్నారు. పోల‌వ‌రం గురించి మాట్లాడొద్ద‌ని చెప్పామ‌న్నారు. కిష‌న్ రెడ్డి ఉభ‌య రాష్ట్రాల అధ్య‌క్షుడిగా ఉండ‌గా, ఆయ‌న్ని రాజమండ్రి తీసుకెళ్లామ‌నీ, పోల‌వ‌రం గురించి మాట్లాడించామ‌నీ చెప్పారు. మీకు తెలంగాణ ఎంత ముఖ్య‌మో, మాకు పోల‌వ‌రం అంతే ప్రాధాన్య‌మైంద‌ని వివ‌రించామ‌ని వీర్రాజు చెప్పారు. పోల‌వ‌రం గురించి తెలుసుకున్న కేసీఆర్ కూడా ముంపు మండ‌లాలు త‌మ‌కే కావాలంటూ ప‌ట్టుబ‌ట్టార‌నీ, దీన్ని మేము గ‌మ‌నించామ‌ని సోము వీర్రాజు చెప్పారు.  ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో చోటు చేసుకున్న స‌మ‌స్య‌ కాంట్రాక్ట‌రూ ప్ర‌భుత్వానికి మ‌ధ్య మాత్ర‌మే వ‌చ్చింద‌న్నారు.
‘పోల‌వ‌రాన్ని రాజ‌కీయ అంశంగా చూడొద్దు, కావాలంటే రాజ‌కీయంగా వినియోగించుకోండీ త‌ప్పులేదు, కానీ ఇంకొక‌రిని బ‌ద్నామ్ చేయొద్దు’ అంటూ ప‌రోక్షంగా టీడీపీ నేత‌ల వైఖ‌రిపై విమ‌ర్శ‌లు చేశారు. కొస మెరుపు ఏంటంటే… పోల‌వ‌రం ప్రాజెక్టును వంద‌శాతం పూర్తిచేస్తామ‌నీ, ఆయ‌న (చంద్ర‌బాబు) ఇచ్చేస్తున్నంత మాత్రాన తీసుకునే ప్ర‌స‌క్తే లేద‌నీ, వారి నిబ‌ద్ధ‌త మీద త‌మ‌కు న‌మ్మ‌కం ఉంద‌నీ, వారే నిర్మిస్తార‌ని సోము వీర్రాజు చెప్ప‌డం. ఓప‌క్క, పోల‌వ‌రం పేరుతో త‌మ‌ను బ‌ద్నామ్ చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతూనే… చంద్ర‌బాబు నిబద్ధ‌త‌పై న‌మ్మ‌కం ఉంద‌ని కూడా చెప్ప‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏదేమైనా, పోల‌వ‌రం ప్రాజెక్టుపై భాజ‌పా చేసిన కృషి గ‌తంలో ఉంద‌ని చెప్పుకోగ‌లిగారు, కానీ ప్ర‌స్తుత చిక్కుముడిని విప్పేందుకు రాష్ట్ర భాజ‌పా నేత‌లు చేయ‌బోతున్న కృషి ఏంట‌నేది మాత్రం సోము వీర్రాజు స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోయారు.
Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com