తెలంగాణ‌లో భాజ‌పాకి భాజ‌పాయే శ‌త్రువు!

ఒక్కోసారి రాజ‌కీయాల్లో శ‌త్రువులు అంటే ప్ర‌త్యేకంగా వేరేగా దూరంగా ఎక్క‌డో ఉండ‌రు! ప్ర‌తిప‌క్షంలోనూ ఉండ‌రు. ఒక్కోసారి పార్టీకి పార్టీయే శ‌త్రువు అవ‌తారం ఎత్తేస్తుంది! సొంత పార్టీ నేత‌లే ఏకు మేకైన సంద‌ర్భాలు వ‌స్తాయి. అదెలాగో స‌రిగ్గా తెలియాలంటే తెలంగాణ భాజ‌పా నేత‌ల్ని అడిగితే స‌రిగ్గా చెబుతారు. రాష్ట్రంలో పార్టీని విస్త‌రింప‌జేయాల‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నిర్ణ‌యాత్మ‌క రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయంగా పార్టీ ఎద‌గాల‌న్న ల‌క్ష్యంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. అందుకే, రాష్ట్ర భాజ‌పా నేత‌లు కూడా ఈ మ‌ధ్య జ‌నంలో బాగా క‌లియ‌దిరుగుతున్నారు. తెలంగాణ విమోచ‌న దినాన్ని అధికారికంగా జ‌ర‌పాలంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఒత్తిడి తెస్తూ పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ కొన్ని జిల్లాల్లో ప‌ర్య‌టించి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తిరిగి వ‌చ్చిన ఆయ‌న… రాష్ట్రంలో తెరాస పాల‌న‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా ఉంద‌నీ, అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌నీ, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు అర‌కొర‌గా ఉన్నాయంటూ ఆయ‌న చెప్పేశారు. అయితే, అస‌లు స‌మ‌స్య అంతా ఇప్పుడు ఎక్క‌డ ఉందీ అంటే… ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన భాజ‌పా నాయ‌కుల‌తోనే!

బీహార్ ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ మోదీ రాష్ట్రానికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న భాజ‌పా నేత అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న తెలంగాణ‌కు వ‌చ్చి కేసీఆర్ పాల‌న అద్భుతో అద్భుత‌స్య అద్భుతోభ్య‌హా అనే రేంజిలో మోసేశారు. గ‌జ్వేల్ వెళ్లి మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మాలు చూశారు, ఎర్ర‌వెల్లి వెళ్లి డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు చూశారు, హైద‌రాబాద్ లోని కొన్ని భ‌వ‌నాలు చూశారు! ఇక‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాల గురించి అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా ఆయ‌న ఇచ్చిన స‌ర్టిఫికేట్ ఏంటంటే, కేసీఆర్ అప‌ర భ‌గీర‌థుడు అని, ఇరుగు పొరుగు రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శి అనీ! ఇలా మోయాల్సిన రేంజిలో కేసీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి, ఆయ‌న వెళ్లిపోయారు. అక్క‌డి నుంచే రాష్ట్ర భాజ‌పా నేత‌ల‌కు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు స‌మాచారం.

ఎందుకంటే, తామెంతో క‌ష్ట‌ప‌డి ప్ర‌జ‌ల్లో తిరిగి.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను భాజ‌పాకు అనుకూలంగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తుంటే, ఏదో రాష్ట్రం నుంచి ఇక్క‌డికి వ‌చ్చిన భాజ‌పా నేత‌లు కేసీఆర్ పాల‌న సూప‌ర్ అంటూ పొగ‌డ్త‌ల‌కు దిగితే ఏం ప్ర‌యోజ‌నం అంటూ వాపోతున్నార‌ట‌! ఓప‌క్క ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధి ఏదీ లేద‌నీ, పేద‌ల‌కు ఇళ్లు అంద‌లేని తాము పోరాటం చేస్తుంటే, బీహారు నుంచి వ‌చ్చిన ఆ పెద్దాయ‌న ప‌థ‌కాలు సూప‌రనీ, డ‌బుల్ బెడ్ ఇళ్లు చాలా బాగున్నాయంటూ మెచ్చుకుంటే వెళ్లిపోతే రాష్ట్రంలో భాజ‌పా ప‌రిస్థితి ఏమౌతుంది..? ప్ర‌జ‌ల‌ను త‌మ‌ను ఏ విధంగా చూస్తున్నారో అనేది వారికి అర్థం కావ‌డం లేద‌ని నేత‌లు గుర్రుగా ఉన్న‌ట్టు స‌మాచారం. జాతీయ స్థాయి నుంచిగానీ, లేదా ఇత‌ర రాష్ట్రాల నుంచిగానీ తెలంగాణ‌కు వ‌చ్చే నేత‌లు ఇక్క‌డి ప‌రిస్థితులు తెలుసుకుని మాట్లాడితే పార్టీకి బాగుంటుంద‌నీ, ఇలా కేసీఆర్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తి వెళ్లిపోతే రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితి ఎప్ప‌టికీ మెరుగుప‌డ‌ద‌ని కొద్దిమంది నేత‌లు తీవ్ర ఆవేద‌న చెందుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి, ఈ ఆవేద‌న అధిష్ఠానానికి వినిపిస్తోందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com