ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుండి 263కి పెరగనుందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2029 ఎన్నికల నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుండటంతో, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పుటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమికి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. నియోజకవర్గాల సరిహద్దులను మార్చే క్రమంలో అధికార పార్టీల అభీష్టానికి ప్రాధాన్యత ఉంటుందనేది గత అనుభవాలు చెబుతున్న సత్యం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన డీలిమిటేషన్ ఎలాగైతే కాంగ్రెస్కు మేలు చేసిందో, ఇప్పుడు అదే తరహాలో కూటమి ప్రభుత్వం పావులు కదిపే అవకాశం ఉంది.
కంచుకోటల విచ్ఛిన్నం.. పులివెందుల టార్గెట్?
ఈ పునర్విభజనలో అత్యంత కీలకమైన అంశం హద్దుల మార్పు . వైసీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలను ముక్కలు చేయడం ద్వారా లేదా వాటి సామాజిక సమీకరణాలను మార్చడం ద్వారా బలహీనపరిచే ప్లాన్లను అమలు చేయవచ్చు. కేవలం హద్దులు మార్చడమే కాకుండా, మహిళా రిజర్వేషన్లు , ఎస్సీ/ఎస్టీ రిజర్వుడు కోటా కిందకు కీలక స్థానాలను తీసుకురావడం ద్వారా ప్రత్యర్థి పార్టీ ముఖ్య నేతల గెలుపు అవకాశాలను దెబ్బతీయవచ్చు. వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందుల వంటి నియోజకవర్గాలను మహిళా కోటాకు కేటాయిస్తే, అక్కడ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం కోల్పోయే పరిస్థితి రావచ్చు.
విపక్ష నేతలకు అగ్నిపరీక్ష
ప్రస్తుతం వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకి రాబోయే డీలిమిటేషన్ అగ్నిపరీక్షగా మారనుంది. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును వేర్వేరు నియోజకవర్గాల్లోకి విడగొట్టడం ద్వారా విపక్ష నేతలను ఇరకాటంలో పెట్టే అవకాశం కూటమికి ఉంది. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతల నియోజకవర్గాలను టార్గెట్ చేయడం ద్వారా, వారి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేయవచ్చని అంచనాలు ఉన్నాయి.
వ్యూహానికి పదును పెడుతున్న కూటమి
చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో డీలిమిటేషన్ ప్రక్రియను పార్టీకి అనుకూలంగా ఎలా మలచుకోవాలో బాగా తెలుసు. కొత్తగా ఏర్పడబోయే సుమారు 88 నియోజకవర్గాలలో సామాజిక బలాబలాలను బేరీజు వేస్తూ, వైసీపీ ని దెబ్బకొట్టేలా డీలిమిటేషన్ చేయనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా కేవలం సీట్లు పెంచుకోవడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీ మూలాలను దెబ్బతీయాలన్నదే కూటమి అసలు లక్ష్యం. డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చే నివేదికపై న్యాయపరంగా వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, ప్రాథమికంగా అధికారంలో ఉన్న వారికే ఈ ప్రక్రియలో పైచేయి లభించడం ఖాయం. అందుకే వైసీపీ నేతలకు అసలు భయం ప్రారంభమయింది.
