ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల మధ్య బుధవారం రాత్రి జరిగిన భేటీ కేవలం ప్రభుత్వ అంశాలకే పరిమితం కాలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అధికారికంగా అమరావతి చట్టబద్ధత, జీ-రామ్-జీ పథకం నిధుల గురించి ప్రకటించినప్పటికీ, ఈ డిన్నర్ మీటింగ్ వెనుక అత్యంత కీలకమైన రాజకీయ ఎజెండా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమరావతికి శాశ్వత రక్షణ కవచం
చంద్రబాబు అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కోరడం వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం కనిపిస్తోంది. భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి నిర్ణయాలు తీసుకోవడం మరోసారి సాధ్యం కాకుండా కేంద్రం ద్వారా ఒక లీగల్ లాక్ వేయాలని ఆయన భావిస్తున్నారు. ఇది కేవలం అభివృద్ధి కోసమే కాకుండా, పెట్టుబడులు పెట్టేవారిలో నమ్మకాన్ని కలిగించేందుకు ,రాజకీయంగా వైపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ఉపయోగపడనుంది. రెండో విడత భూసమీకరణ ప్రారంభమైన సమయంలో ఈ చట్టబద్ధత రైతులకు మరింత ధైర్యం ఇస్తుంది. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు పాస్ అయ్యేలా చంద్రబాబు మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
జీ-రామ్-జీ స్కీం , ఆర్థిక వెసులుబాటు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని మార్చింది. ఈ పథకంలో రాష్ట్ర వాటాను 40 శాతానికి పెంచడం ఏపీకి పెనుభారంగా మారింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడానికి, ఈ వాటాను తగ్గించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులు సర్దుబాటు చేయడంపై చంద్రబాబు గట్టిగా పట్టుబట్టినట్లుగా చెబుతున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ కేటాయింపులు ఉండేలా అమిత్ షా ద్వారా హామీ పొందే ప్రయత్నం ఇది.
లోతైన రాజకీయ చర్చలు
బయటకు వెల్లడించని అంశాలలో.. రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ప్రతిపక్ష నేతలపై ఉన్న కేసులు, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తీసుకోబోయే కఠిన రాజకీయ నిర్ణయాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. నిర్ణయాలకు కేంద్రం మద్దతు ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కేంద్రం సహకారం ఉంటేనే రాష్ట్రంలో పాలనతో పాటు రాజకీయంగానూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు. అందుకోసమే అత్యవసరంగా ఈ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ భేటీ ప్రభావం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో , వచ్చే కేంద్ర బడ్జెట్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. అలాగే రాజకీయాల్లోనూ మార్పులు కనిపించే అవకాశం ఉంది.
