న‌రేష్‌ది దించేయ‌డానికి మాస్ట‌ర్ స్కెచ్‌

‘మా’ ర‌గ‌డ మామూలుగా లేదు. అధ్య‌క్షుడిగా ఉన్న న‌రేష్‌ని దించేయ‌డానికి మాస్ట‌ర్ స్కెచ్ మొద‌లైపోయింది. న‌రేష్‌, రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య వ‌చ్చిన విబేధాలు, చినికి చినికి గాలివాన‌గా మారి, ఇప్పుడు న‌రేష్ ప‌ద‌వికే ఎస‌రు తెచ్చాయి. అధ్య‌క్షుడిగా న‌రేష్ లేకుండానే `మా` జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌రిగిపోయింది. అందులో కీల‌క నిర్ణ‌యాలు కూడా తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ స‌మావేశంలో ప్ర‌ధాన చ‌ర్చ అంతా న‌రేష్ వ్య‌వ‌హార శైలి గురించే జ‌రిగింద‌ట‌. `మా` కార్య‌వ‌ర్గంలో 26మంది స‌భ్యులు. 18 మంది మ‌ద్ద‌తు రాజ‌శేఖ‌ర్ వ‌ర్గానికి ఉంది. వీరంతా… న‌రేష్‌ది దించ‌డానికి కావ‌ల్సిన మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు. అధ్య‌క్షుడి ప‌ద‌వీకాలం రెండేళ్లు. అయితే మ‌ధ్య‌లో దించేసే అధికారం స‌భ్యుల‌కు ఉంది. అలా జ‌ర‌గాలంటే 26మంది కార్య‌వ‌ర్గ స‌భ్యులంతా మూకుమ్ముడిడిగా ఓ తీర్మాణం చేయాలి. ప్ర‌స్తుతం అందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. `మా` లా బుక్‌లో అధ్య‌క్షుడిని తొల‌గించ‌డానికి ఎన్ని మార్గాలున్నాయి? వాటికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఎంత‌? అనే విష‌యాల‌పై ఇప్పుడు తీవ్ర చర్చ జ‌రుగుతోంది. అయితే…. ఈ వ్య‌వ‌హారం తొల‌గింపు వ‌ర‌కూ వెళ్ల‌డం మంచిది కాద‌ని, త‌న‌పై ఉన్న వ్య‌తిరేక‌త గ్ర‌హించిన న‌రేష్ స్వ‌యంగా ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డం మేల‌ని, అది `మా` అధ్య‌క్ష పీఠానికి కూడా మంచిద‌ని పెద్ద‌లు భావిస్తున్నారు. ఇండ్ర‌స్ట్రీలోని పెద్దల దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లి, వాళ్ల అభిప్రాయం స్వీక‌రించిన త‌ర‌వాతే… న‌రేష్‌పై అభిశంస‌న తీర్మాణం ప్ర‌వేశ పెట్టాల‌ని భావిస్తున్నారు. మొత్తానికి న‌రేష్ కుర్చీ క‌దులుతోంది. త‌న‌పై వ్య‌తిరేక‌త గ్ర‌హించి న‌రేష్ ఈ ప‌దవి నుంచి త‌ప్పుకుంటాడో, లేదంటే.. దించేసే వ‌ర‌కూ తెచ్చుకుంటాడో, పెద్ద‌లు ఓ రాజీ కుదిర్చి – ఈ వ్య‌వ‌హారాన్ని స‌ర్దుబాటు చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com