స్టార్ హీరో ఉన్నంత మాత్రాన.. సినిమాలకు బజ్ రావాలని ఏం లేదు. కొన్ని సినిమాల్లో ఎంతమంది స్టార్లు ఉన్నా.. పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోరు. కానీ ‘పెద్ది’ అలా కాదు. ఈ సినిమా ఓ పాజిటీవ్ బజ్ తో మొదలైంది. అది రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. గ్లింప్స్, చిరికి పాట… ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇప్పుడు ‘రై.. రై.. రారా’ పాట కూడా ఇన్స్టెంట్ గా హిట్ అయిపోయింది. దాంతో.. మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
గ్లింప్స్, చికిరి, రైరై.. ఈ మూడింట్లో గమనించిన కామన్ పాయింట్… చరణ్ బ్యాటింగ్ స్టైల్. గ్లింప్స్ లో చరణ్ ఓ వెరైటీ సిక్సర్ కొట్టాడు. దాన్నే చికిరి పాటలోనూ రిపీట్ చేశారు. ఇప్పుడు రై రై పాటలో మరో కొత్త రకమైన స్టెప్ ని చూపించారు. ఈ సినిమాలో ఇలాంటి వెరైటీలు ఇంకా ఉన్నాయి. వాటిని ఒకొక్కటిగా రివీల్ చేయబోతున్నార్ట.
‘పెద్ది’ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చుట్టూ నడిచే రూలర్ డ్రామా. స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఒకటే అనుకొనేరు. ఇంకా చాలా ఉన్నాయి. కుస్తీ, కబడ్డీ.. ఇలా చాలా రకాలైన ఆటలు ఈ సినిమాలో చరణ్ ఆడబోతున్నాడు. కానీ ఇప్పటి వరకూ చూపించింది క్రికెట్ మాత్రమే. మిగిలిన ఆటలు సర్ప్రైజ్ గా ఉంచేశారు. అవన్నీ థియేటర్లో చూడాలి. ఓ సాధారణమైన ఆటగాడు.. ప్రపంచ స్థాయి కీర్తిని ఎలా సంపాదించాడో ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్. అన్నట్టు ఈ సినిమా నిడివి 4 గంటలని, ఓ గంట కోత వేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అవన్నీ కేవలం పుకార్లే అని, పెద్ది రన్ టైమ్ కంట్రోల్ లోనే ఉందని చిత్రబృందం ఇప్పటికే స్పష్టం చేసింది.


