ఇల్లంతా సందడిగా ఉంటూ.. అందరూ ఓ ముఖ్యమైన వేడుకలో పాల్గొంటున్న ఫీలింగ్ తో ఉంటే.. ఆ పాజిటివ్ వైబ్స్ ఎంత గొప్పగా ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ఉత్సాహమే కనిపిస్తోంది. అమరావతి రాజధాని పునర్ నిర్మాణం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయింది. ఓ వేడుకలా ఈ కార్యక్రమం సాగింది. రాష్ట్ర మంతా ఆసక్తిగా చూశారు. మన రాజధాని అనే భావనతో.. ఒక్క సారే యాభై వేల కోట్ల రూపాయల పనులను మోదీ ప్రారంభించడంతో ఈ సారి ఆలస్యం కాదన్న నమ్మకంతో ఉన్నారు.
పునాదుల మీద నుంచి కట్టేయడమే !
అమరావతి రాజధానికి ఎప్పుడో పునాదులు పడ్డాయి. ఆ పునాదుల్ని తవ్వేసే రాక్షస జాతి తర్వాత అధికారంలోకి రావడంతో పాడుబడిపోయాయి. అయితే ఆ పునాదులు చెక్కు చెదరలేదు. అది భౌతికంగానే కాదు.. ప్రజల మనసుల్లో కూడా. అందుకే ఈ సారి అమరావతి నిర్మాణం పునాదుల మీద నుంచి చకచకా జరిగిపోతుంది. మాస్టర్ ప్లాన్లు, పునాదులే ఎక్కువ పని. ఆ తర్వాత వరుసగా కట్టుకుంటూ వెళ్లిపోతారు. టార్గెట్ ప్రకారం నిర్మాణాలు చేయించడంలో చంద్రబాబుకు ప్రత్యేక అనుభవం ఉంది. అందుకే ఏడాది. .రెండేళ్లలోనే అమరావతి నిర్మాణంలో స్పష్టమైన మార్పు కనిపించనుంది.
నిధుల సమస్యే లేదు !
అమరావతి కోసం బడ్జెట్లో కేవలం రైతులకు ఇవ్వాల్సిన కౌలు కోసం మాత్రమే నిధులు కేటాయించారు. పనుల కోసం రూపాయి కూడా కేటాయించలేదు. కానీ అమరావతికి నిధుల కొరత లేదు. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా రూ.50వేల కోట్లు ఇప్పటికే అమరావతి కోసం రెడీగా ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రం చెల్లిస్తుంది. మరికొన్ని అమరావతి నిర్మాణం పెరిగేకొద్దీ పెరిగే భూముల విలువతో.. ఆ అప్పులను తీర్చుకుంటారుత ఇంకా ఎక్కువగా రాష్ట్ర సంపద పెరుగుతుంది. దీని వల్ల ప్రజలకు ఉపాది అవకాశాలు.. ఆదాయం పెరుగుతుంది.
అమరావతికి క్యూ కట్టనున్న ప్రైవేటు కంపెనీలు
అమరావతికి పెద్ద ఎత్తున ప్రైవేటు కంపెనీలు క్యూ కట్టనున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కోసం మూడు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి ఒకటి నాటికి క్వాంటమ్ వ్యాలీ రెడీ అవుతుంది. అమరావతిలో భూములు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల నిర్మాణాలతో ఆ ప్రాంతం బిజీగా మారనుంది. ఉపాధి అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. ఈ కళ రాష్ట్రం మొత్తం కనిపించనుంది.