ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వేసవి ఇంకా ప్రారంభం కాక ముందే కరెంట్ కోతలు వెంటాడుతున్నాయి. గత మూడు రోజుల నుంచి లోడ్ రిలీఫ్ పేరుతో అదే పనిగా పట్టణం, గ్రామాల్లో కరెంట్ కోతలు విధిస్తున్న ప్రభుత్వం ఆ సమయాన్ని అలా పెంచుకుంటూనే పోతోంది. ఫలితంగా గ్రామాల్లో అలజడి తరహా వాతావరణ కనిపిస్తోంది. వ్యవసాయానికే కాదు ఇప్పుడు గృహ అవసరాలకు కరెంట్ ఏకధాటిగా రెండు గంటలు పోతే జీవనం కష్టమయ్యే పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ కోతలు అమలు చేయడం ప్రజల్ని అసహనానికి గురి చేస్తోంది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్లుగా ప్రజలకు విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు చేసుకోలేకపోవడం.. .ఎవరికి చెల్లించాల్సినవి వారికి చెల్లింపులు చేయకపోవడంతో సమస్య ప్రారంభమయింది. అయితే ఒక సమస్య పరిష్కారమయ్యేలోపు మరో సమస్య వచ్చి పడుతోంది. దీంతో కోతలు కొనసాగుతున్నాయి . కానీ ప్రభుత్వం విద్యుత్ మంత్రి మాత్రం ఏపీలో అసలు కరెంట్ కోతలే లేవంటున్నారు.
సాంకేతిక సమస్యలతో అక్కడక్కడా కరెంట్ తీస్తున్నారని.. రెండు రోజుల్లో అదీ సర్దుకుంటుదని అంటున్నారు. ఏపీలో ఇప్పటికే చిన్నతరహా పరిశ్రమలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు కరెంట్ కోతల వల్ల మరిన్ని సమస్యలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఏం జరిగితే అది జరుగుతుందని.. నింపాదిగానే పనులు చేసుకుంటూ పోతోంది. ప్రజలు మాత్రం ఉక్కపోతకు గురవుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సమ్మర్ పరిస్థితేమిటని భయపడేవారి సంఖ్య పెరిగిపోతోంది.