ఆపండి..! పోలవరం”రివర్స్”పై ఏపీ సర్కార్‌కు పీపీఏ మరో “ప్రేమలేఖ”..!

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎవరేమనుకున్నా… తాము అనుకున్నట్లుగానే ఏపీ సర్కార్ ముందుకు వెళ్తోంది. కానీ ప్రతి అడుగునూ పోలవరం ప్రాజెక్ట్ అధారిటి.. పీపీఏ తప్పు పడుతూ లేఖలు రాస్తోంది. తాజాగా రివర్స్ టెండరింగ్ విషయంలోనూ.. అదే తరహా లేఖ వచ్చింది. పోలవరం ప్రాజెక్టులో మిగిలిన భాగానికి.. అలాగే.. రూ. 3200 కోట్లుకుపైగా విలువైన.. విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి నేడు రివర్స్ టెండర్లు పిలువనున్నారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ… హుటాహుటిన ఓ లేఖ పంపింది. రివర్స్ టెండర్లను పిలువడం మానుకోవాలని సూచించింది. త్వరలో తాము ప్రాజెక్ట్ పరిస్థితిపై… కేంద్రానికి నివేదిక ఇస్తామని.. కేంద్రం నిర్ణయం తీసుకునే వరకూ వేచి చూడాలని.. పీపీఏ కోరింది.

కేంద్రం నిర్ణయం తీసుకునే వరకూ ఆగండి..!

పోలవరం పనులు చేస్తున్న నవయుగ, బెకం అనే సంస్థలను.. అర్థంతరంగా గెంటేసి.. అంతే మొత్తం పనులకు కొత్తగా రివర్స్ టెండర్లు పిలవాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీకి నచ్చలేదు. ఈ నిర్ణయం వల్ల ప్రాజెక్ట్ భవితవ్యం ప్రమాదంలో పడుతుందని.. పీపీఏ అభిప్రాయపడుతోంది. అంత కీలకమైన ప్రాజెక్టులో.. 70 శాతం పనులు పూర్తయిన తర్వాత ఇతరులు చేపడితే.. పనుల్లో సమన్వయం ఉండదని… అది మొత్తానికే ప్రాజెక్ట్ భద్రతకే ప్రమాదమని పీపీఏ అంచనా వేస్తోంది. పైగా.. కాంట్రాక్ట్ ఏజెన్సీలు.. బాగా పని చేస్తున్నాయని.. అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవని చెబుతున్నారు. కాంట్రాక్టర్లను మార్చడానికి ఎలాంటి కారణాలు లేవన్న పీపీఏ… రీటెండరింగ్ ఆలోచన విరమించుకోవాలని తాజా లేఖలో కోరింది. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాకపోతే.. ప్రజాప్రయోజనాలు నెరవేరవని.. పీపీఏ చెబుతోంది.

ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ముందుకేనని చెబుతున్న సీఎం..!

నిజానికి ఏపీ సర్కార్ పోలవరం ప్రాజెక్ట్ అధారిటీని ముందు నుంచీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. అసలు ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రతి విషయం.. పీపీఏ అనుమతితోనే సాగాల్సి ఉన్నప్పటికీ.. ఏపీ సర్కార్ మాత్రం… పీపీఏ అధికారాలను గుర్తించడానికి సిద్ధపడటం లేదు. పీపీఏ భేటీలో కూడా… తమకు అధికారాలున్నాయనే వాదించారు. ఈ క్రమంలో… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పట్టుదల ప్రదర్శిస్తున్నారు. చివరికి.. ఆగస్టు పదిహేను స్పీచ్‌లోనూ.. పోలవరం రివర్స్ టెండర్లు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ… వెళ్తామని ప్రకటించారు.

పీపీఏ లేఖపై జగన్ ఏం చేయబోతున్నారు..?

ఏపీ ప్రభుత్వ మొండిపట్టుదల.. సరైన కారణాల్లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు.. పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్ ను ప్రమాదంలో పెడుతున్నాయన్న అభిప్రాయం జలవనరుల నిపుణుల్లో ఏర్పడుతోంది. ప్రాజెక్ట్ కు సంబంధించి ఆర్థిక సాయం కేంద్రం చేస్తున్నప్పుడు.. ఏదైనా కేంద్ర అనుమతి తీసుకుని చేసుకోవాలి. లేకపోతే.. ఒక్క రూపాయి కూడా.. కేంద్రం ఇవ్వదు. అలా ఇవ్వకపోతే.. ప్రాజెక్ట్ సాగదు. ఈ విషయం తెలిసి కూడా.. ముఖ్యమంత్రి పోలవరం విషయంలో ఎందుకంత మంకుపట్టుకు పోతున్నారో… పీపీఏ ఉన్నతాధికారులకూ అయోమయంగా ఉంది. తాజా లేఖతో అయినా.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఆపుతారో… అంతా మా ఇష్టం అన్నట్లుగా ముందుకు వెళ్తారో… పీపీఏ కూడా.. నిశితంగా గమనిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com