సోషల్ మీడియాలో సమాజాన్ని, వ్యవస్థలను, రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్‌ట్యాగ్‌తో నీతులు చెప్పే ప్రకాష్ రాజ్ ఇప్పుడు తీవ్రమైన చట్టపరమైన, నైతికపరమైన ఒత్తిడిలో కూరుకుపోయారు. ఇన్నాళ్లూ ఇతరులను బోనులో నిలబెట్టిన ఆయన, నేడు తానే సమాజం ముందు ఒక నిందితుడిగా నిలబడ్డారు. ఒకవైపు అత్యంత వివాదాస్పదమైన ధర్మస్థల కుట్ర కేసు ఆయనపై కత్తిలా వేలాడుతుండగా.. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రధాన సాక్షి చిన్నయ్య ఇచ్చిన సంచలన స్టేట్మెంట్ ప్రకాష్ రాజ్ మెడకు గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తోంది. కోర్టు పరిధిలో ఉన్న ఈ తీవ్రమైన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు, న్యాయస్థానం కంటే ముందే మీడియా వేదికగా తనదైన శైలిలో కవర్ చేసుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా బెడిసికొట్టాయి.
తేలుకుట్టిన దొంగలా నైజం.. ‘నాలుగు ఓటర్ కార్డుల’ మౌనం!
ధర్మస్థల వివాదం ఇలా ఉండగానే.. తాజాగా ఆయన నాలుగు వేర్వేరు దక్షిణ భారత రాష్ట్రాలలో అక్రమంగా ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారంటూ బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేయడం ఆయన చట్టపరమైన ఇబ్బందులను రెట్టింపు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంప్రకారం ఇది తీవ్రమైన నేరమైనప్పటికీ, ప్రకాష్ రాజ్ ఈ అంశంపై ప్రదర్శిస్తున్న మౌనం అనేక సందేహాలకు తావిస్తోంది. ఒకవేళ ఆ వార్త అబద్ధమే అయితే.. “నాకు నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు లేదు, కేవలం బెంగళూరులోనే ఉంది అని సూటిగా ముక్కేసి చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ, ఆ నిఖార్సైన నిజం చెప్పకుండా, సదరు వార్తలను ప్రసారం చేసిన ఛానళ్లను గోడీ మీడియా , ఫేక్ మీడియా అంటూ ఎక్స్ లో రంకెలు వేయడం ఆయన డిఫెన్స్‌లో పడ్డారనే విషయానికి అద్దం పడుతోంది. నిజం నిలకడ మీద తెలుస్తుందనే సామెత చందంగా.. ఈ వ్యవహారంలో ఆయన తీరు తేలుకుట్టిన దొంగ లా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పవన్, మోదీలపై విమర్శలు.. ఇప్పుడు తిరగబడ్డ నీతులు!
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీపై, అటు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తూ, పొలిటికల్ మైలేజ్, ఉచిత పబ్లిసిటీ పొందడం ప్రకాష్ రాజ్‌కు అలవాటుగా మారింది. సనాతన ధర్మం, సామాజిక బాధ్యతలపై ఆయన వేదికలెక్కి చెప్పిన సుద్దులన్నీ ఇప్పుడు ఆయనకే రివర్స్ అయ్యాయి. పక్కన ఉన్నవారిపై బురద జల్లేటప్పుడు ఉన్న ఉత్సాహం.. తాను ఓటర్ కార్డుల్లాంటి నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పుడు ఎందుకు కనిపించడం లేదని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇతరులను వేలెత్తి చూపించే ముందు, మన చేతులు ఎంతవరకు శుభ్రంగా ఉన్నాయో చూసుకోవాలనే కనీస సూత్రాన్ని ‘ప్రశ్నించే గళం’ విస్మరించిందనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యూవర్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి.
మీడియాపై నెపం.. చేతకానితనానికి పరాకాష్టా?
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎంత ఉందో.. సమాధానం చెప్పాల్సిన జవాబుదారీతనం కూడా అంతే ఉంది. ప్రకాష్ రాజ్ తనపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలతో సమాధానం చెప్పలేక.. తనే తిరిగి ప్రశ్నించే వారిని, మీడియా సంస్థలను అమ్ముడుపోయిన మీడియా అని నిందించడం ఆయన చేతకానితనానికి పరాకాష్ట అని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. ఒక సెలబ్రిటీగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, కోర్టు సమన్లను సైతం ఖాతరు చేయకుండా వరుసగా నాన్-బైలబుల్ వారెంట్లు తెచ్చుకోవడం న్యాయవ్యవస్థను కించపరచడమే అవుతుంది.
సమాధానం చెప్పాల్సిన ‘సమయం’ ఆసన్నమైంది!
ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ స్క్రిప్టులు రాయడం వేరు.. న్యాయస్థానం ముందు నిలబడి బోనులో సమాధానం చెప్పడం వేరనే కఠిన సత్యాన్ని ప్రకాష్ రాజ్ గుర్తించాల్సిన సమయం వచ్చింది. ధర్మస్థల కేసు విచారణ, చిన్నయ్య స్టేట్మెంట్, ఓటర్ ఐడీల వివాదం.. ఈ మూడు అంశాలు ఆయన నైతిక విలువలను తీవ్రంగా పరీక్షకు పెడుతున్నాయి. ఇకనైనా సోషల్ మీడియాలో నీతులు ఆపి, చట్టానికి గౌరవం ఇచ్చి కోర్టు ముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో సమాజం ముందు ఆయన ఒక పొలిటికల్ ట్రోలర్ గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.