ప్రొ.నాగేశ్వర్: ఆంధ్రప్రదేశ్‌లో మహాకూటమికి ప్రశాంత్ కిషోర్ రంగం సిద్ధం చేశారా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఓ మహాకూటమికి రూపకల్పన జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్.. జగన్మోహన్ రెడ్డి.. సర్వే చేసి మరీ ఓ నివేదిక పంపారని.. దాని ప్రకారం… ఎన్నికలకు ముందే బీజేపీతో ప్రి పోల్ అలయెన్స్ పెట్టుకోవాలనేది…. ఆ నివేదిక సారాంశమని చెబుతున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను కూడా కలిపి మహాకూటమిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో.. ప్రశాంత్ కిషోర్ ఉన్నారని చెబుతున్నారు.

బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా ఆత్మహత్యా సదృశమేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే… ఆత్మహత్యా సదృశమే. అక్కడి ప్రజల్లో.. బీజేపీపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో… కాంగ్రెస్ పార్టీపై ఎంత అసంతృప్తి చూపించారో.. అంత కంటే ఎక్కువగా.. ఆగ్రహం బీజేపీపై ఉంది. ఏపీకి బీజేపీ నిజంగానే ఏమీ చేయలేదో.. లేకపోతే.. చంద్రబాబే అలా ప్రచారం చేశారో కానీ… మొత్తానికి బీజేపీపై ఏపీ ప్రజల్లో ఉన్న ఆగ్రహం మాత్రం నిజం. అలాంటి సమయంలో… బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా… అది చంద్రబాబుకు లాభం కలగడం ఖాయం. అదే సమయంలో జగన్- పవన్ కలిస్తే.. చంద్రబాబుకు ఇబ్బందికర పరిణామమే. అది చంద్రబాబును ఓటమి అంచుల వరకూ తీసుకెళ్తుంది. అందుకే ..జగన్ బీజేపీతో కలిసే అవకాశం లేదని చెప్పొచ్చు. కలిస్తే.. పవన్ కల్యాణ్‌తో మాత్రం కలిసే చాన్స్ ఉంది.

పవన్ , జగన్ కలిసే అవకాశం ఉందా..?

అయితే జగన్ – పవన్ వారిద్దరూ కలుస్తారా అన్నదే పాయింట్. ఎందుకంటే.. సినీ పరిశ్రమలో… ఉన్నత స్థానాన్ని అధిరోహించి… రాజకీయాల్లోకి వచ్చిన వారు.. తాము ఒకరి వెంట నడవడానికి ఇష్టపడరు. ఇప్పుడున్న పరిస్థితుల‌ని బట్టి చూస్తే.. పవన్ కల్యాణ్… జగన్ తో పొత్తు పెట్టుకోవాలంటే.. జూనియర్ పార్టనర్‌గా ఉండటానికి అంగీకరించాలి. అలా చేస్తే.. పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్‌లా ఉండలేరు. జనసేన అభిమానులు దీన్ని జీర్ణించుకోలేరు. వైసీపీకి జూనియర్ పార్టనర్‌గా వ్యవహరిస్తే జనసేన, జనసైనికులు ఎంత మేర మిగులుతారో ఎవరూ చెప్పలేరు. అందుకే… ఇలా కూటమి కట్టే పని పవన్ కల్యాణ్ చేస్తారా…? ఆ రాజకీయ వ్యూహం అమలు చేస్తారా..? తాను గెలవరు కాబట్టి.. ఎంతో కొంత ఓటింగ్ వస్తుంది కాబట్టి… ఎన్నో కొన్ని సీట్లతో సర్దుబాటు చేసుకుందామా అని… ఆలోచిస్తారా..?

జగన్‌కు కలుపుకునే మనస్థత్వం ఉందా..?

కానీ… ఓట్ల లెక్కలు కన్నా… పొలిటికల్ కెమిస్ట్రీ చాలా ముఖ్యం. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం పెరిగిన కొద్దీ… టీఆర్ఎస్ బలపడింది. ఒక వేళ కేసీఆర్ ఏపీలో ప్రచారానికి వస్తే… అది చంద్రబాబుకే లాభం కలుగుతుంది. ఇంకో విషయం ఏమిటంటే.. జగన్మోహన్ రెడ్డి.. ఇతర పార్టీలతో కలిసే వ్యక్తిత్వం ఉన్న నేత కాదు. గత ఎన్నికల్లో.. జగన్మోహన్ రెడ్డి .. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే అధికారాన్ని కోల్పోయారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తేనే ఈ ఓటింగ్ వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీతో కలవడానికి కమ్యూనిస్టులతో అవకాశం వచ్చింది. కమ్యూనిస్టులను.. జగన్ దూరం పెట్టారు. వారికి ఉండే.. ఒకటి , రెండు శాతం ఓట్లు… జగన్ కు వచ్చి ఉంటే.. ఫలితారు తారుమారయ్యేవి కదా..!. అంతే కాదు..ఈ ఐదేళ్లలో… ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా.. ఇతర పక్షాలను కలుపుకుని పోరాటం చేయాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు.

ఎన్నికల తర్వాత ఎవరు ఎవరితో కలుస్తారో చెప్పలేం..!

ఏ విధంగా చూసినా… తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చేయడానికి ఏమీ లేదు. తెలంగాణలో .. టీఆర్ఎస్ పరహారు సీట్లు గెలవాలని బీజేపీ కోరుకుంటుంది. ఏపీలో టీడీపీ ఓడిపోవాలని కోరుకుంటుంది. ఎన్నికల తర్వాత నెంబర్లను బట్టి.. టీఆర్ఎస్, వైసీపీ.. బీజేపీకి మద్దతిస్తాయి. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే.. జగన్మహోన్ రెడ్డి కాంగ్రెస్‌కు మద్దతివ్వరన్న గ్యారంటీ ఏమీ లేదు. ఆ మాట కొస్తే టీఆర్ఎస్ కూడా మద్దతివ్వబోదన్న గ్యారంటీ లేదు. మాకు జాతీయ రాజకీయాలతో సంబంధం లేదు. మాకు రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేదనే వాదన వినిపించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.