ఎన్నికల్లో పోటీ చేయను అంటే చేతులు ఎత్తేసినట్లే అన్నది రాజకీయాల్లో స్ట్రాటజీ. రాజకీయ పార్టీని నడిపించేవారు ముందు ఉండి నడిపించాలంటే.. తాను ఏదో ఓ చోట నుంచి పోటీ చేయాలి. అంతే కానీ నేను పోటీ చేయను..మీరంతా గెలవండి ..నేను సీఎం అవుతాను అంటే కామెడీ అయిపోతుంది. ఇప్పుడు బీహార్ లో ప్రశాంత్ కిషోర్ ఇలాంటి కామెడీ రాజకీయం స్టార్ట్ చేశారు. ఎన్నికల్లో పోటీకి ఆయన వెనుకడుగు వేశారు. ఇది పార్టీ నిర్ణయం అని..తాను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీ అభ్యర్థుల కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు.
ప్రాంతీయపార్టీలకు ప్రజాదరణ ఉన్న వారే నాయకత్వం వహించగలరు. ప్రశాంత్ కిషోర్ స్ట్రాజసిస్టుగా తనకు వచ్చిన పేరును రాజకీయాలకు ఉపయోగించుకోవాలనుకున్నారు . ఆయన ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూ.. తన పార్టీకి క్యాడర్ ను..బీహార్ బాగుపడాలి అని కోరుకునేవారి మద్దతును కూడగట్టగలిగారు. కానీ ఆయనకు బలమైన సామాజికవర్గ అండ కనిపించడం లేదు. రెండు కూటముల మధ్య బీహార్ లోని సామాజికవర్గాలు చీలిపోయాయి. బలమైన ఓ సామాజికర్గం ప్రశాంత్ కిషోర్ కు అండగా ఉంటే.. ఓటు బ్యాంక్ వస్తుంది. అలాంటి వర్గమే పీకేకు కరవయింది.
ఒక వేళ తాను పోటీ చేసి తాను కూడా ఓడిపోతే.. తనకు బలం లేదని తేలిపోతుంది. బీహార్ లో ప్రశాంత్ కిషోర్ పార్టీ గెలిచే అవకాశం లేదు. కింగ్ మేకర్ అవ్వాలని ఆయన అనుకుంటున్నరాు. ఇలాంటి సమయంలో తాను పోటీ చేయడం వల్ల ..తన బలం గురించి అందరికీ తెలిసిపోతుంది. ఓ బలమైన నియోజకవర్గాన్నీ ఆయన తయారు చేసుకోలేకపోయారు. అందుకే ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదని డిసైడయ్యారు.