ఈమధ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లు మరీ రొటీన్‌గా తయారయ్యాయి. కొంతమంది సినిమా ప్రముఖులే అసలు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ల వలన సినిమా ప్రమోషన్స్‌కి పెద్ద ప్రయోజనం చేకూరడం లేదని బహిరంగంగా చెప్పారు. నిజమే.. ఒక పెద్ద హీరో సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చే హైప్ వేరు. కానీ చిన్న, మీడియం సినిమాలకు ఈ ఈవెంట్లు సరైన బజ్ ఇవ్వలేకపోతున్నాయనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. దీనికితోడు ఈవెంట్‌కి క్రియేటివ్ ప్లానింగ్ ఉండటం లేదు. రొటీన్‌గా స్పీచుల మీదే ఆధారపడి పోతుంటారు. అవి కూడా ఈవెంట్‌కి వచ్చే అతిథుల సహనానికి పరీక్షలా ఉంటున్నాయి.
తాజాగా అల్లరి నరేష్ ‘రైల్వే కాలనీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి అతిథులుగా హరీష్ శంకర్, విజయ్ కనకమేడల, వి.ఐ. ఆనంద్ లాంటి దర్శకులు వచ్చారు. బేసిక్‌గా ఈవెంట్ అంటే చూడటానికి ఏదైనా ఇంట్రస్టింగ్‌గా ప్లాన్ చేస్తే కాసేపు కాలక్షేపం చేయొచ్చు. అలా కాకుండా కేవలం స్పీచులు మాత్రమే అనుకుంటే.. వీలైనంత షార్ప్‌గా పూర్తి చేయాలి. అప్పుడే వచ్చిన గెస్టులకు త్వరగా మైక్ అందుతుంది. వాళ్లు చెప్పే నాలుగు మాటలు సినిమాకి ఎంతోకొంత ప్లస్ అవుతాయని ఓ ఆశ.
కానీ ఇలాంటి ఈవెంట్స్‌లో సీన్ రివర్స్‌లో ఉంటుంది. పాపం సినిమా కోసం సంవత్సరాలుగా కష్టపడ్డ యూనిట్ అందరికీ మాట్లాడటానికి ఇదొక్కటే వేదిక. అందుకే ప్రతిఒక్కరికీ మైక్ వెళుతుంది. వాళ్లు చెప్పే మాటలు ఎవరైనా వింటారా లేదా అనేది తర్వాత సంగతి.. ముందు మైక్ పట్టుకొని తమ ఫీలింగ్స్ అన్నీ చెప్పేస్తారు. అలా చెప్పే క్రమం కూడా పరమ రొటీన్. ఆర్ట్ డైరెక్టర్ నుంచి మొదలుపెట్టి డైరెక్టర్, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరో వరకూ వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయి అతిథులకు అసహనం వచ్చేస్తుంది. నిన్న ఈవెంట్లో ఇదే జరిగింది. ఈ ఈవెంట్‌ని షార్ట్ అండ్ స్వీట్‌గా ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ మెయిన్ స్పీచులు దగ్గరకు వచ్చేసరికి సమయం దాటిపోయింది.
ఇప్పటికే సమయం దాటిపోయిందని స్పీచ్ మొదలుపెట్టి హడావిడిగా ముగించారు విజయ్ కనకమేడల. అయితే హరీష్ శంకర్ మాత్రం ఒక సెటైర్ వేశారు. ‘ఇదొక థ్రిల్లర్ సినిమా. సినిమా నిడివి రెండు గంటలే. కానీ యూనిట్ అందరూ చాలా ఎక్కువ మాట్లాడారు. ఇంత ఎక్కువ మాట్లాడి అంత షార్ప్ సినిమా ఎలా తీశారో?’ అంటూ శ్లేష వాడారు.
నిజమే.. కనీసం సినిమా కంటెంట్ తగ్గట్టుగా అయినా స్పీచులు ప్లాన్ చేసుకోవాలి. సమయంపై ఒక నియంత్రణ ఉండాలి. కేవలం స్పీచుల మీద ఈవెంట్ ఆధారపడినప్పుడు వాటిని క్రియేటివ్‌గా అయినా రాసుకోవాలి. అలా కాకుండా ఏదో మొక్కుబడిగా మాట్లాడుకుంటూ, సాగదీసుకుంటూ వెళితే సినిమాకి పెద్ద ప్రయోజనం చేకూరకపోగా అతిథులుగా వచ్చిన వారికి సైతం ఇబ్బందే. ఇలాంటి ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి చాలా మంది అతిథులు ముందుగానే మైక్ అందుకొని తమ వంతుగా మాట్లాడేసి ఈవెంట్ నుంచి బయటపడిపోతుంటారు.
కొందరు మాత్రం మొహమాటానికి పోయి చివరి వరకూ తప్పక ఉంటారు. ఇలాంటి సందర్భంలో చివరిగా మాట్లాడే హీరో కూడా పరిస్థితిని గమనించి త్వరగా స్పీచ్‌ని ఫినిష్ చేసేస్తారు. దీనివల్ల ఒక మైనస్ ఉంది. పేపర్, మీడియా ఛానళ్లలో హీరో, చీఫ్ గెస్ట్ స్పీచ్ నే ప్రచారం చేస్తారు. మిగతా వాళ్ల స్పీచులను పెద్దగా పరిగణలోకి తీసుకోరు. అలాంటి కీలకమైన స్పీకర్స్ హడావిడిగా ముగించేయడం సినిమాకి నష్టమే. ఏదేమైనా.. ఈ సోషల్ మీడియా కాలంలో కూడా ఇలాంటి సాంప్రదాయ ఊకదంపుడు ఉపన్యాసాలకు స్వస్తి చెప్పి, కొత్తగా ఆలోచించి క్రియేటివ్‌గా ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవడం మంచిది. ఒకటి మాత్రం నిజం… ఇలాంటి ఈవెంట్లతో పబ్లిసిటీ పెరుగుతుందనో, సినిమా త్వరగా జనంలోకి చేరువ అవుతుందనో అనుకోవడం పొరపాటు. కొత్తగా ఆలోచించి జీరో బడ్జెట్ పబ్లిసిటీతో కూడా ప్రేక్షకుల్ని మెప్పించొచ్చు. సినిమా గురించి మాట్లాడుకొనేలా చేయొచ్చు. ఆ దిశగా క్రియేటీవ్ గా ఆలోచిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. గెస్టులకు తలనొప్పి తగ్గుతుంది.


