సాధారణంగా ఒక అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొన్నప్పుడు, ఆ మొత్తం ప్రాజెక్ట్ ఉన్న భూమిలో మీకు వచ్చే వాటాను అన్‌డివైడెడ్ షేర్ అంటారు. అయితే, ఇటీవల కొందరు బిల్డర్లు ఈ విధానాన్ని అడ్డం పెట్టుకుని కొత్త తరహా స్కామ్స్‌కు తెరలేపుతున్నారు. ప్రాజెక్ట్ ఇంకా కాగితాల మీదే ఉన్నప్పుడే, కేవలం భూమి వాటాను రిజిస్ట్రేషన్ చేస్తామని, తక్కువ ధరకే ఫ్లాట్ ఇస్తామని మధ్యతరగతి ప్రజలను ఊరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే లాభాలను ఆశించి సామాన్యులు తమ కష్టార్జితాన్ని ఇలాంటి వెంచర్లలో గుమ్మరిస్తున్నారు.
ఒకే వాటా.. అనేక మందికి విక్రయం!
ఈ స్కామ్‌లో ప్రధానంగా జరుగుతున్న మోసం మల్టిపుల్ రిజిస్ట్రేషన్ . ఒకే భూమి వాటాను వేర్వేరు వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించడం లేదా అదే భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి భారీగా రుణాలు తీసుకోవడం వంటివి వెలుగు చూస్తున్నాయి. నిర్మాణ అనుమతులు రాకముందే ఇలాంటి లావాదేవీలు జరగడం వల్ల, తీరా అనుమతులు వచ్చేసరికి బిల్డర్ ప్లాన్‌లో మార్పులు చేస్తే.. మీరు కొన్న వాటాకు, వస్తున్న ఫ్లాట్‌కు పొంతన ఉండదు. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తి, కొనుగోలుదారులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
రెరా నిబంధనల ఉల్లంఘన
నిజానికి రియల్ ఎస్టేట్ నిబంధనల ప్రకారం, రేరా గుర్తింపు లేకుండా లేదా ప్రాజెక్ట్ ప్లాన్ అప్రూవల్ రాకుండా ఇలా UDS విక్రయాలు చేయడం చట్టవిరుద్ధం. కానీ, మార్కెట్ ధర కంటే 30 నుండి 40 శాతం తక్కువకే వస్తుందనే ఆశను పెట్టుబడిదారుల్లో కల్పించి, బిల్డర్లు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయినా లేదా బిల్డర్ చేతులెత్తేసినా, మీ చేతిలో ఉన్న రిజిస్ట్రేషన్ కాగితాలు కేవలం కాగితాలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే ఆ భూమిపై అప్పటికే బ్యాంకులకు లేదా ఇతర ఇన్వెస్టర్లకు హక్కులు ఉండి ఉండవచ్చు.
కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
UDS ప్రాతిపదికన ఇల్లు లేదా ప్లాట్ కొనేవారు కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను మాత్రమే కాకుండా, బిల్డర్ విశ్వసనీయతను కూడా పరిశీలించాలి. సదరు ప్రాజెక్ట్‌కు రేరా నంబర్ ఉందా? లేఅవుట్ అప్రూవల్స్ వచ్చాయా? బ్యాంకు లోన్లు ఇస్తున్నాయా? అనేది ముందే సరిచూసుకోవాలి. తక్కువ ధరకు వస్తోందని తొందరపడి అనుమతులు లేని వెంచర్లలో పెట్టుబడి పెడితే, రేపు ఆ భవనం అక్రమ నిర్మాణంగా ముద్ర పడినా లేదా నిర్మాణమే పూర్తి కాకపోయినా చట్టపరంగా రక్షణ పొందడం చాలా కష్టమవుతుంది.

