మహేశ్‌బాబు, రాజమౌళి సినిమా అప్డేట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలిసారి సినిమా నుంచి ఒక పూర్తి లుక్ వదిలారు. కుంభ గా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర పరిచయం చేశారు. ‘నేను అవతలి వైపు ఉన్నాను. ఈ కుంభతో నేరుగా కలిసే సమయం ఆసన్నమైంది’ అని మహేష్ బాబు ట్వీట్ వేశారు మహేష్.
మహేష్ ట్వీట్, ఆ లుక్ చూస్తుంటే ఇందులో సుక్కుది విలన్ రోల్ అనిపిస్తోంది. అయితే జక్కన్న విలన్ కి ఒక ప్రత్యేక వుంది. హీరో కంటే ఆయన విలన్స్ పవర్ ఫుల్ గా వుంటారు. పైగా విలనిజం విషయంలో జక్కన్నకి ప్రత్యేకమైన నిర్వచనాలు వుంటాయి. ఆయన విలన్ కంప్లీట్ గా దుర్మార్గుడు. సగం మంచి సగం చెడు వుండవు. విలన్ అంటే విలనే. అంతేకాదు ఫిజికల్ గా స్ట్రాంగ్ వుంటాడు. అంగబలం, అర్ధబలం హీరోకంటే పైస్థాయిలో వుంటాయి.
అయితే తాజాగా వచ్చిన సుకుమార్ లుక్ చూస్తుంటే ఆయన కాళ్ళు చేతులు చచ్చుబడి వీల్ చైర్ కి పరిమితమైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. కాకపోతే అది పవర్స్ వున్న చైర్. బ్యాక్ డ్రాప్ లో సైన్స్ ఫిక్షన్, రోబో మిషనరీ కనిపిస్తున్నాయి. అయితే విలన్ ఫిజికల్ ఎప్పిరియన్స్ మాత్రం రాజమౌళి మార్క్ కి డిఫరెంట్ గా వుంది.
చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘ఒక్కడున్నాడు’ సినిమా విలన్ విషయంలో టాలీవుడ్ కు చాలా పాఠాలు నేర్పింది. చాలా అద్భుతమైన సినిమా అది. కానీ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. దీనికి కారణం విలన్ నిస్సాయత, అవిటితనం. విలన్ బ్రతకాలంటే హీరో ప్రాణం కావాలి. హీరో ప్రాణాలు నిలుపుకోవాలి. ఇద్దరిది ప్రాణం కోసం పోరాటమే. పైగా ఛాతీ నిండా వైర్లు, పేస్ మేకర్లు పెట్టుకున్న విలన్ ని చూస్తే జాలిపడుతుంది. అక్కడే సినిమాపై దెబ్బపడింది. ఆడియన్స్ కి హీరో మీద రావాల్సిన సింపతీ డైల్యూట్ అయిపొయింది. ఏదైనా నిస్సాయత, అవిటితనం వున్న విలన్ పాత్రలు రాసుకునే దర్శకులకు ‘ఒక్కడున్నాడు’ సినిమా ఓ పాఠంలా వుంటుంది. ఒక సందర్భంలో రాజమౌళే ఈ అంశాన్ని ప్రస్థావించినట్లు ఉన్నారు.
రాజమౌళి మొదటి సినిమా నుంచి మొన్నటి ఆర్ఆర్ఆర్ విలన్ కి తిరుగులేదు. కానీ ఫస్ట్ టైం విలన్ ని ఇలా వీల్ చైర్ లో కూర్చోబెట్టారు. కాకపోతే రాజమౌళి లెక్కలు వేరు. సినిమా నుంచి తొలి పరిచయంగా ఇలాంటి వీల్ చైర్ లుక్ వదిలారంటే ఆయన ఎంచుకునే సెటప్ వేరుగా వుంటుంది. అది ఇప్పుడే ఊహకు అందకపోవచ్చు. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఓ ఈవెంట్ జరగనుంది. ఆ ఈవెంట్లో ఈ సినిమా టైటిల్ తో పాటు మరింత సమాచారం తెలిసే అవకాశం వుంది.