చిత్రసీమ అంతా విజయాల చుట్టూనే తిరుగుతు ఉంటుంది. హిట్టుకి ముందూ, ఆ తరవాత పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయి. ఒక్క రాత్రే జీవితం మొత్తం మారిపోతుంది. అందుకు కళ్ల ముందే చాలా ఉదాహరణలు నిలిచాయి. ముఖ్యంగా సినిమా హిట్టయితే హీరోలకూ, దర్శకులకు నిర్మాతలు వరాల జల్లులు కురిపిస్తుంటారు. ఖరీదైన బహుమానాలు ఇస్తుంటారు. కార్లు, గాడ్జెట్స్… ఇలా బోలెడు. కానీ దర్శకుడికి ఇల్లు కొనిస్తా అని మాట ఇచ్చినవాళ్లు చాలా తక్కువ. ఇప్పుడు ధీరజ్ మొగలినేని అదే చేశారు. తన దర్శకుడికి ఇల్లు కొనిస్తా అని ప్రామిస్ చేశారు.
నటుడు రాహుల్ రవీంద్రన్ లో ఓ దర్శకుడు కూడా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. చిలసౌ తో నేషనల్ అవార్డు అందుకొన్నారాయన. ఇప్పుడు ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమా తీశారు. రష్మిక హీరోయిన్. ఈ చిత్రానికి ధీరజ్ మొగలినేని నిర్మాత. ఈ సందర్భంగా తన దర్శకుడికి ఇల్లు కొనిస్తా అని మాట ఇచ్చారు ధీరజ్. ”రాహుల్ కి హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదు. ఈ సినిమా హిట్టయితే.. మంచి ఇల్లు కొనుక్కొంటా అనేవారు. ఈ సినిమా హిట్టయితే మీ సొంత ఇంటి కల నేను నెరవేరుస్తా. నాకు సినిమా ఎప్పుడైనా చేసి పెట్టండి ఫర్వాలేదు. ఇది మీ కోసం కాదు… మీ కుటుంబం కోసం.. మీ పిల్లల కోసం” అని దర్శకుడికి మాట ఇచ్చారు ధీరజ్.
నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో రష్మికకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వస్తుందని ఇది వరకే జోస్యం చెప్పారు. “ఈ సినిమా చూశాక చాలామందికి రాత్రిళ్లు నిద్ర పట్టదు. తక్కువ రేటింగ్ ఇవ్వడానికి వాళ్లకు మనసు ఒప్పుకోదు“ అని కామెంట్ చేశారు అరవింద్.
