ప్రొ.నాగేశ్వర్: ఆదివాసీ, లంబాడీల చిచ్చు పాపం రాజకీయానిదే..!

తెలంగాణలో లంబాడీలకు .. ఆదివాసీలకు ఘర్షణ జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇది మరింత తీవ్రమవుతోంది. ఇది చాలా ప్రమాదకరం. పాత ఆదిలాబాద్ జిల్లాలో తమ తమ గ్రామాల్లో లంబాడీలకు ప్రవేశం లేదని బోర్డులు కూడా పెట్టారు. ఆదివాసీలు, లంబాడీలు రెండు వర్గాలూ… అత్యంత వెనుకబడినవారే. ఇప్పుడు ఇద్దరి మధ్య పోరు తీవ్ర స్థాయి ఉద్రిక్తతలకు కారణం అవుతోంది.

ఆదివాసీల అవకాశాలు లంబాడీలకు..!
షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో మొదటి నుంచి ఉన్నవారు.. ఆదివాసీలు, గోండులు. వీరు గిరిజనుల్లో అత్యంత తక్కువ మంది ఉంటారు. అయితే 1976లో ఉమ్మడి రాష్ట్రంలో లంబాడీలను.. ఎస్టీ జాబితాలో చేర్చారు. లంబాడీలు సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉంటారు. పైగా.. ఆదివాసీలు, గోండులతో పోలిస్తే…కాస్త మెరుగైన స్థితిలో ఉంటారు. కాబట్టి ఎస్టీ జాబితాలో అవకాశాలు ఎక్కువగా వారే పొందుతున్నారు. అందుకే ఆదివాసీల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితి ఎస్సీల్లోనూ ఉంది. ఎస్సీ రిజర్వేషన్లలో అత్యధికం మాలలే పొందుతున్న మాదిగలు అసంతృప్తితో ఉన్నారు. అందుకే వారు ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమం చేస్తున్నారు. ఎస్టీలో జాబితాలో చేరిన తర్వాత తమ అవకాశాలన్నింటినీ లంబాడీలను కొట్టుకుపోతున్నారన్న ఆగ్రహం ఇటీవలి కాలంలో ఆదివాసీల్లో పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీల్లో మరంత ఆందోళన పెరిగింది. అందుకే వారు లంబాడీలను.. ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ఉద్యమం చేస్తున్నారు. ఇదే ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.

ఆదివాసీల్లో ఆభద్రత నింపిన తెలంగాణ..!
తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఆదివాసీల్లో ఆందోళన పెంచాయి. మొత్తం మూడు అంశాలు వారిలో తీవ్ర ఆభద్రతా భావాన్ని కలిగించాయి. అందులో మొదటిది పోలవరం అంశం. పోలవరం ప్రాజెక్ట్ వల్ల అత్యధికంగా నిర్వాసితులయ్యేది గిరిజనులే. తెలంగాణ ఉద్యమం సమయంలో పోలవరం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్.. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం.. ఏడు మండలాల్ని ఏపీలో కలుపుతున్నా పెద్దగా వ్యతిరేకించలేదు. ఆ ఏడు మండలాల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టే కేసీఆర్ పట్టించుకోలేదన్న భావనలో ఆదివాసీలున్నారు. ఇక రెండో సమస్య జిల్లాల విభజన. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల విభజన పేరుతో వేర్వేరు జిల్లాల్లో ఆదివాసీలు.. ఉండేలా… ముక్కలయ్యేలా చేసిందన్న భావనలో ఉన్నారు. ఆదివాసీల్లో ఆగ్రహం పెరిగిపోవడానికి మరో కారణం వాల్మీకి బోయల్ని ఎస్టీల్లో చర్చేందుకు ప్రయత్నాలు చేయడం. కొన్ని రోజుల కిందట కేసీఆర్.. ఈ అంశంపై చెల్లప్ప కమిషన్ నియమించారు. ఎస్టీల్లోకి మరొందర్ని చేర్చే ప్రయత్నం చేయడం సహజంగానే ఆదివాసీల్లో ఆగ్రహం తెప్పించింది.

లంబాడీలకు ఎక్కువ అవకాశాలు..!
విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లోతాము తీవ్రంగా నష్టపోతున్నారు. అందులో సందేహం లేదు. 1961లో తెలంగాణలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ జాబితా కేవలం 2.8 శాతం మాత్రమే. 1981లో వీరి జనాభా 8.1 శాతంగా నమోదైంది. ఇరవై ఏళ్లలో ఎస్టీ జనాభా ఇంత అసాధారణంగా పెరడం అసాధ్యం. 1976లో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిన తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగింది. అంతే కాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో లంబాడీలు… ఇక్కడికి తరలి వచ్చారు. మహారాష్ట్రలో లంబాడీలు ఓబీసీలు. వారు ఏపీకి వలస వచ్చి… ఎస్టీ సర్టిఫికెట్లు పొంది… విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు అందుకుంటున్నారు. మామూలుగా అయితే వారు మహారాష్ట్ర లంబాడీలు అయితే.. అక్కడి రాష్ట్ర చట్టాల ప్రకారమే కులాన్ని నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ వారి సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఇలా మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ లంబాడీ వర్గం ఎమ్మెల్యే ఎస్టీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కోర్టు చెల్లదని తీర్పునిచ్చింది.

పరిష్కారం ఏమిటి..?
ఆదివాసీలు, లంబాడీలు రెండు వర్గాలు కూడా కూడా వెనుకబడిన వాళ్లే. ఇద్దరి ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఎస్టీల రిజర్వేషన్లను పొందడంలో ఆదివాసీలు వెనుకబడుతున్నారని లంబాడీలు గుర్తించాలి. ఆదివాసీలు మరింతగా వెనుకబడుతున్నారని వారు కూడా గ్రహించాలి. అదే సమయంలో.. ఇప్పులు లంబాడీల జనాభా అనూహ్యంగా పెరిగింది. రాజకీయ అవసరాలే లక్ష్యంగా ఉండే పార్టీలు.. లంబాడీల మద్దతును పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేవు. అందుకే ఆదివాసీలు డిమాండ్ చేసినట్లు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించలేరు. ఈ విషయాన్ని కూడా ఆదివాసీలు గుర్తుంచుకోవాలి. ఇద్దరి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవలాంటే.. వర్గీకరణ ఒక్కటే దారి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన ఫైల్ కూడా కేంద్రం వద్ద ఉంది. ఈ వర్గీకరణనుకూడా.. దానితో పాటు పూర్తి చేసి.. జనాభా ప్రాతిపదికన ఎవరి అవకాశాలు వారికి వచ్చేలా చేస్తే… సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com