ప్రొ.నాగేశ్వర్ : విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగిందా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు.. అన్ని పార్టీల వాళ్లు.. విభజనతో నష్టపోయామని పదే పదే చెబుతూ ఉంటారు. కట్టుబట్టలతో తమను రోడ్డు మీద వదిలేశారని చెబుతూ ఉంటారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఉన్నట్లు ప్రకటనలు చేస్తూ ఉంటారు. అయితే పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. ఏపీ బడ్జెట్ ఇప్పుడు రూ. రెండు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు దాటింది. సంక్షేమ పథకాల కోసం.. వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందరికీ… ఏపీ నేతలు అబద్దాలు చెబుతున్నట్లేనా..?

రెండు రాష్ట్రాల బడ్జెట్లు రూ. లక్షల కోట్లెలా దాటిపోతున్నాయి..?

పదేళ్ల క్రితం.. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఉత్తరప్రదేశ్ బడ్జెట్ కన్నా పెద్దది. అప్పట్లోనే.. దీన్ని అద్భుతంగా చెప్పుకున్నారు. అంటే.. పదేళ్ల క్రితం.. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష కోట్లకు చేరితేనే అద్భుతంగా చెప్పుకున్నారు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు… విడి విడిగా.. చెరో రెండు లక్షల కోట్ల బడ్జెట్లను ప్రవేశ పెడుతున్నాయి. అంటే.. ఉమ్మడి రాష్ట్రంగా తీసుకుంటే.. ఈ బడ్జెట్లు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దాటిపోయాయి. ఈ లెక్కలు చూస్తే ఆర్థిక అభివృద్ధి ఇంతా వేగంగా ఉందా.. అన్న అనుమానం రాకమానదు. విభజన సమయంలో… ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేశారని.. పదే పదే విమర్శించారు నాడు మద్రాస్ నుంచి.. ఇప్పుడు హైదరాబాద్ ను పంపేశారని విమర్శలు చేశారు. కట్టుబట్టలతో వచ్చేశామన్నారు. మరి ఇప్పుడు బడ్జెట్ చూస్తే.. అన్యాయం జరిగిందని అనుకోవచ్చా..? కేంద్రం అన్యాయం చేసిందని ఇప్పటికీ చెబుతున్నారు. ఓ వైపు.. కష్టాలు పడుతున్నామని చెబుతున్నారు. మరో వైపు.. అభివృద్ధి, పెట్టుబడులు రావడంలో.. తామే నెంబర్ వన్ అంటున్నారు. అంటే ఎకనమిక్ రియాలిటీ ఒకటిగా ఉంది.. ప్రజలకు చెప్పేది వేరుగా ఉంది.

ప్రజలకు చెప్పేదానికి .. వాస్తవ పరిస్థితులకు సంబంధం లేదా..?

ప్రజలను ఉద్వేగాలు, భావోద్వేగాలకు గురి చేయడానికి అన్యాయమైపోయాం.. దిక్కుతోచని స్థితిలో ఉన్నాం… కట్టుబట్టలతో వచ్చామని చెబుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఓట్లేయాలి కాబట్టి. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో ఎకనమిక్ రియారిటీకీ రాజకీయ నేతలు ప్రచారం చేసే దానికి తేడా ఉంటుంది. తమ తమ రాష్ట్రాలు ప్రగతి పథంలో ఉన్నాయంటూనే.. విభజన వల్ల నష్టపోయామని.. కేంద్రం సహకరించడం లేదని చెబుతూ ఉంటారు. రెండింటిలో ఏదో ఒకటి రియాలిటీ ఉండాలి కదా..!. హైదరాబాద్ లో ఆంధ్రులు గురించి రకరకాలుగా ప్రచారం చేశారు. రాష్ట్రం విడిపోతే.. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు .. అసలు కరెంట్ ఉండదని చెప్పారు. కానీ ఇప్పుడు… కరెంట్ కొరత లేదు. తెలంగాణ ఏర్పడితే.. మావోయిస్టులు పెరుగుతారని.. మత కల్లోలాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. ఏమీ జరగలేదు. మొత్తం పరిశ్రమలు తరలిపోతాయన్నారు.. ఏమీ జరగలేదు కదా..!

విభజన అంశంతో ప్రజలను రెచ్చగొడుతున్నారా..?

వివిధ అంశాలపై ప్రజలను రెచ్చగొట్టడానికి రాజకీయ నాయకులు..అనేక మాటలు చెబుతున్నారు. రియాలిటీలో అది ఉండటం లేదు. విభజన వల్ల కొన్ని నష్టాలు ఉండి ఉండవచ్చు. కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. కానీ ప్రజలకు రాజకీయ పార్టీలు వాస్తవాలు చెప్పడం లేదు. అభివృద్ధి అనేది.. రాష్ట్రం కలిసి ఉండటం వల్లో.. విడిపోవడం వల్లో జరగదు. అభివృద్ధి అనేది ప్రభుత్వాలు అనుసరించే ఆర్థిక విధానాల వల్ల ఉంటుంది. ప్రపంచంలో జరిగే ఆర్థిక పరిణామాలపై ఆధారపడి ఉంటుందని చాలా సార్లు చెప్పాను. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు జరుగుతోంది. విడిపోయినప్పటికీ… రెండు తెలుగు రాష్ట్రాలు భారీ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాయి. అంటే… దీన్ని బట్టి సులువుగా అర్థం చేసుకోవచ్చు.. రాజకీయ నాయకులు చెప్పే మాటలు వేరు… వాస్తవిక పరిస్థితులు వేరు …అని..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com