ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏపీలో మరో రాజకీయ పార్టీకి అవకాశం ఉందని తేల్చారు. తన వారాంతపు కొత్తపలుకులో ఈ వారం జెన్ జీ, జెన్ అల్ఫాల గురించి ఆందోళన చెందారు. వారే రాజకీయాలను మార్చేస్తున్నారని ఆయన అభిప్రాయం. విజయ్ గెలుపుతో పాటు ఇటీవల ప్రధాని మోదీ, చంద్రబాబు జెన్ జీ, జెన్ అల్ఫాలను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి చాలా రాశారు. వారిని ఆకట్టుకుంటేనే భవిష్యత్ ఉంటుందని.. ఇప్పుడు గతంలో రాజకీయ పార్టీలు ఎన్ని త్యాగాలు చేశాయి.. ఎంత ఘన చరిత్ర ఉందన్నది ఎవరూ పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు.
అంతా చెప్పిన తర్వాత ఏపీలో మరో రాజకీయ పార్టీ కి చోటు లేదని భావించడానికి లేదన్నారు. ఎవరు పార్టీ పెడతారో కానీ.. జెన్ జీ, జెన్ ఆల్ఫాకు బాగా కనెక్టయిన వ్యక్తి పెట్టాలి. దానిపై ఎలాంటి ఇండికేషన్ ఇవ్వలేదు. ఈ విషయం పక్కన పెడితే యువతలో జవాబుదారీ తనం కోసం అసహనం పెరిగిపోతోందని ఆర్కే తేల్చారు. అందుకే కాక్రోచ్ పార్టీకి కాంగ్రెస్, బీజేపీల కన్నా ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఫాలోవర్లు వచ్చారని తేల్చారు. న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థల్లోనూ జవాబుదారీ తనం తగ్గిపోయింది కాబట్టే యువత ఆగ్రహం అనేది ఆర్కే విశ్లేషణ.
అయితే ప్రస్తుత రాజకీయాల్లో యువనేతల కంటే వృద్ధనేతలతే జెన్ జీ, జెన్ అల్ఫాలను ఆకట్టుకుంటున్నారని మోదీని ఉదాహరణగా చెప్పారు. రాహుల్ గాంధీ.. తన సంప్రదాయ పనితీరు కారణంగా యువతకు దూరంగా ఉండగా..మోదీ మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతూ జెన్ జీ, జెన్ అల్ఫాలకు ఆరాధ్య నాయకుడిగా మారారు. టీడీపీ కూడా ఈ మార్పును గుర్తించిమారుతోందని.. అందుకే మహానాడులో పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు.
ఆర్కే ఈ సారి జెన్ జీ, జెన్ అల్ఫాలకు క్రెడిట్ ఇచ్చేందుకు సమయం కేటాయించారు. అందుకే వారికి పార్టీ పెట్టే హక్కు ఉందని.. రాజకీయాల్లో స్పేస్ ఉంటుందని ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. రాజకీయాల్లో వాక్యూమ్ అనేది ఎప్పటికీ ఉండదు. ఎవరైనా సృష్టించుకోవాల్సిందే. మరి ఆర్కే .. ఏపీలో మరో రాజకీయ పార్టీ కి చోటుందని అన్నారంటే.. ఆయనకు ఏదనా హింట్ ఉందేమో?



