హైదరాబాద్ నగరం దశాబ్దాలుగా తనకున్న కాస్మోపాలిటన్ సంస్కృతితో దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అయితే, ఇటీవల కాలంలో మళ్ళీ పాత ప్రాంతీయ విద్వేషాల గళం వినిపిస్తుండటం పారిశ్రామిక , పెట్టుబడి వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నిర్మాణం శరవేగంగా పుంజుకుంటున్న తరుణంలో, హైదరాబాద్‌లో మళ్ళీ ఇలాంటి అస్థిరత వాతావరణం నెలకొనడం ఎవరికి లాభం?
తెలంగాణ ఉద్యమం సమయంలో ఇన్వెస్టర్ల వెనుకడుగు
తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో అనేక సందేహాలు వచ్చాయి. అందుకే పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన భరోసా, శాంతిభద్రతల నిర్వహణలో చూపిన చొరవ వల్ల హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్‌గా ఎదిగింది. కానీ, ఇప్పుడు సందర్భం లేకపోయినా ఆంధ్రుల పెట్టుబడులు వద్దు.. ఫార్మా పరిశ్రమలు వద్దు.. ఇతరులు వెళ్లిపోవాలి అంటూ కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాలకే గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి. పెట్టుబడిదారుడు ఎప్పుడూ తన పెట్టుబడికి భద్రత, రాజకీయ స్థిరత్వం కోరుకుంటాడు. అనవసరంగా ప్రాంతీయ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి బెదిరింపులకు దిగడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
అమరావతి ఎదుగుదల – హైదరాబాద్ సవాలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుంది. కేంద్రం నుంచి వస్తున్న భారీ సాయం , పారిశ్రామిక ప్రోత్సాహకాలతో అమరావతి ఇప్పుడు ఇన్వెస్టర్లకు కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలో హైదరాబాద్‌లో మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రాజుకోవడం అమరావతికి పరోక్షంగా ఒక అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. ఎక్కడైనా అశాంతి నెలకొంటే, పెట్టుబడులు సహజంగానే ప్రశాంతంగా ఉన్న ప్రాంతానికి తరలిపోతాయి. అయితే, పక్క రాష్ట్రంలో అశాంతి వల్ల తమకు లాభం కలగాలని ఏపీ ప్రభుత్వం కోరుకోవడం లేదు. కేవలం తమ ప్రాంతంలోని అవకాశాలు, లాభాలను చూసే పెట్టుబడిదారులు రావాలని అమరావతి ఆకాంక్షిస్తోంది.
ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం
హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి పెట్టుబడులు, శ్రమశక్తి గణనీయమైన భాగం. ఫార్మా, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో దశాబ్దాలుగా ఉన్న నెట్‌వర్క్‌ను ఒక్క నినాదంతో విచ్ఛిన్నం చేయాలని చూడటం ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది. కేవలం రాజకీయ ఉనికి కోసం కొంతమంది చేస్తున్న ఇలాంటి ప్రకటనలు సామాన్య తెలంగాణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను దూరం చేసే ప్రమాదం ఉంది. తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచిన తర్వాత కూడా ఇంకా సెటిలర్లు – లోకల్ అనే చర్చ తీసుకురావడం వల్ల ప్రపంచ స్థాయి కంపెనీలు తమ కార్యాలయాలను మార్చుకునే దిశగా ఆలోచించే అవకాశం లేకపోలేదు.
ప్రభుత్వ బాధ్యత ఏమిటి?
ఇలాంటి విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసే వారిపై ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అందరిదీ అని, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన ప్రతి ఒక్కరికీ రక్షణ ఉంటుందని ప్రభుత్వం గట్టిగా చెప్పాలి. లేనిపక్షంలో, ఈ వివాదం ముదిరితే అది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కాదు, తెలంగాణ భవిష్యత్తుకే నష్టం కలిగిస్తుంది. ప్రాంతీయ అస్థిరత అనేది అభివృద్ధికి పెద్ద శత్రువు. పొరుగు రాష్ట్రంతో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలే తప్ప, విద్వేషాలతో కూడిన బెదిరింపులు ఏ ప్రాంతానికీ మేలు చేయవు.


