ప్రొ.నాగేశ్వర్ : పొత్తుల వ్యూహాల్లో మోడీని చూసి రాహుల్ నేర్చుకోవాలి..!

భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు… మిత్రపక్షాలను దువ్వడానికి శతవిథాలా ప్రయత్నిస్తోంది. దూరంగా జరుగుతున్న మిత్రపక్షాలను దగ్గర చేసుకుంది. బీహార్, మహారాష్ట్రలో పొత్తులు కుదుర్చుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడినట్లుగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాను తగ్గుతూ పొత్తులు ఖరారు చేసుకుంటున్న బీజేపీ..!

దేశ రాజకీయాల్లో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి.. పార్టీలన్నీ ఆయా మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచీ ఒత్తిడి ఎదుర్కొంది. అయితే.. అమిత్ షా, నరేంద్రమోడీ ఇద్దరూ కలిసి… సమస్యలను ఒక్కొక్కరిగా పరిష్కరించుకుంటూ వచ్చారు. ముందుగా.. బీహార్‌లో.. పరిస్థితిని చక్కబెట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో… జేడీయూ లేకుండా.. బీజేపీ..ఇతర పార్టీలను కలుపుకుని పోటీ చేసి ఘన విజయం సాధించింది. జేడీయూకి రెండే సీట్లు వచ్చాయి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ విజయం కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. మళ్లీ మధ్యలో ఆర్జేడీని వదిలేసి.. బీజేపీతో జట్టుకట్టారు జేడీయూ నేత నితీష్ కుమార్. ఇప్పుడు సీట్ల సర్దుబాటు సమస్య వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ రెండే సీట్లు గెలవడంతో… వారికి తమ సిట్టింగ్ సీట్లను ఇవ్వాల్సి వచ్చింది. సగానిపైగా సిట్టింగ్ సీట్లను జేడీయూ ఇతర మిత్రపక్షాలకు ఇచ్చి.. పొత్తు నిలుపుకుంది. రామ్‌ విలాస్ పాశ్వాన్ పార్టీ వెళ్లిపోతుందనే అనుకున్నారు. ఎందుకంటే.. పాశ్వాన్.. కేంద్రాన్ని విమర్శించడం ప్రారంభించారు. ఈ లోపే వారికి కావాల్సిన సీట్లు ఇచ్చి… నిలబెట్టుకున్నారు. ఇలాంటి వ్యవస్థ బీజేపీలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో… అనేక వ్యవస్థలు ఉంటాయి. పలువురు … పలు నిర్ణయాలు చెబుతారు. చివరికి.. ఎవరి ఆలోచన అమల్లోకి వస్తుందో చెప్పలేం.

అవకాశం ఉన్న అన్ని చోట్లా మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు పూర్తి..!

ఇక మహారాష్ట్రలో కూడా.. బీజేపీ… కాస్త తెలివిగానే వ్యవహరించింది. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీని ప్రతి అంశంలోనూ.. తీవ్రంగా విమర్శిస్తున్న పార్టీ శివసేన. జీఎస్టీ దగ్గర్నుంచి బుల్లెట్ రైలు వరకు ప్రతి అంశంలోనూ.. శివసేన… భారతీయ జనతా పార్టీని తీవ్రంగా విమర్శిస్తూనే ఉంది. ఒంటిగా పోటీ చేస్తామని పదే పదే చెప్పినప్పటికీ.. శివసేనను చివరికి పొత్తుకు ఒప్పించగలిగారు. కొన్ని సీట్లను ఎక్కువగా ఇచ్చి మరీ.. పొత్తును ఖరారు చేసుకున్నారు. అయినా శివసేన విమర్శలు కొనసాగిస్తోంది.. అది వేరే విషయం. దక్షిణాదిలో .. బీజేపీకి పొత్తులు పెట్టుకునే అవకాశం ఒక్క తమిళనాడులోనే ఉంది. అన్నాడీఎంకేతో.. బీజేపీ నేతలు పొత్తుల్ని ఖరారు చేసుకున్నారు. కర్ణాటకలో.. పొత్తులకు అవకాశం ఉన్నప్పటికీ.. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండకూడదనుకున్నారు . యడ్యూరప్ప కాస్త తగ్గి ఉంటే.. అక్కడ జేడీఎస్‌తోనే పొత్తు ఏర్పడి ఉండేది. ఆయన సీఎం కావాలనుకున్నారు కాబట్టి… చాన్సిచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన వెళ్లారు.

రాహుల్ ఈ విషయంలో మోడీని చూసి నేర్చుకోవాలి..!

ఏపీ, తెలంగాణలో.. భారతీయ జనతా పార్టీతో ఎవరూ కలవరు. కేరళలోనూ అంతే. అన్నాడీఎంకే… బీజేపీ మిత్రపక్షం అని ఎప్పటి నుండో చెబుతున్నారు. పార్లమెంట్‌లోనూ బీజేపీకి… సాయం చేసింది. టీఆర్ఎస్, అన్నాడీఎంకే.. పార్లమెంట్‌లో అప్రకటిత మిత్రపక్షాలుగా పని చేశాయి. తర్వాత టీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే.. పూర్తిగా భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వెళ్లింది. అక్కడ బీజేపీతో.. పొత్తు పెట్టుకున్నా లేకపోయినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ..పొత్తుల విషయంలో అంత చురుగ్గా లేరు. బీహార్‌లో ఆర్జేడీతో పొత్తు ఫైనల్ కాలేదు. యూపీలో ఎస్పీబీఎస్పీ కాంగ్రెస్‌ను దూరం పెట్టాయి. కర్ణాటకలో జేడీఎస్‌తో రోజూ గొడవలే అవుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీతో పొత్తు ఖరారు కాలేదు. బెంగాల్‌లో పొత్తులు పెట్టుకుంటామని మమతా బెనర్జీ చెప్పారు కానీ.. ఇంకా చర్చలు ఫలించలేదు. అలాగే.. ఏపీలో టీడీపీ కలసి పోటీ చేయడానికి సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజాకూటమి పరిస్థితి తెలియడం లేదు. ఇలా.. పొత్తుల విషయాల్లో చూస్తే.. మోడీని అభినందించాల్సిందే. రాహుల్‌ను.. నేర్చుకోవాలని సూచించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.