ప్రొ.నాగేశ్వర్: జమిలీ ఎన్నికలు అసాధ్యం..!

పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేది కొత్త వాదన కాదు. గతంలో నీతి ఆయోగ్ సూచించింది. లా కమిషన్ ప్రతిపాదించింది. ప్రధానమంత్రి మోడీ కూడా అనేక సార్లు చెప్పారు.ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోడీ మరోసారి చెప్పారు. పదే పదే ఎన్నికలు వస్తూండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నది మోడీ వాదన. అయితే జమిలీ ఎన్నికల వల్ల లాభమేంటి..?. పార్లమెంట్ ఎన్నికలతో అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం అరవై శాతం మంది వ్యక్తం చేశారు. కానీ దీని లోతుల్లోకి వెళ్తేనే జమిలీ ఎన్నికల వచ్చే ఇబ్బందులు, సమస్యలు ఏమిటి..? అనేది తెలుస్తుంది.

జమిలీ ఎన్నికలు ఎందుకంటే..?
ఎక్కువ శాతం మంది జమిలీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే.. ప్రతి ఏడాది ఏదో ఒక ఎన్నిక వస్తూనే ఉంటుంది. పార్లమెంట్, అసెంబ్లీ, మధ్యంతర, ఉపఎన్నికలు ఇలా… ఏదో రూపంలో ఎన్నికలు వస్తూనే ఉంటాయి. ప్రభుత్వాలు ఎన్నికల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాల అభివృద్ధిపై దృష్టి సారించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు మళ్లీ అధికారంలోకి రావడంపైనే దృష్టి పెడుతున్నారు. దీని కోసం జనాకర్షక పథకాల వైపే మొగ్గుచూపుతున్నారు. దీర్ఘకాల ప్రయోజనాలు వచ్చే పథకాలపై ప్రభుత్వాలు దృష్టి పెడితే ప్రయోజనం ఉండదు. అందుకే ప్రజలకు ఉన్న పళంగా ప్రయోజనం కల్పించే పథకాలకే మొగ్గుచూపుతున్నాయి. ఎన్నికలు పదే పదే జరగకపోతే… ఈ ప్రాబ్లం ఉండదు. ప్రభుత్వాలు దీర్ఘకాలిక అభివృద్ధి పథకాలపై దృష్టి పెడతాయి. రెండో సమస్య ఏమిటంటే… ఎన్నికల ఖర్చు. ప్రతీసారి ఏదో ఎన్నిక జరగడం వల్ల రెండు, మూడింతల ఎక్కువ ఖర్చు అవుతోంది. ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ఖర్చు మిగులుతుంది. అందుకే లోక్ సభకు కానీ.. అసెంబ్లీలకు కానీ ఐదేళ్లకు ఓ సారి ఎన్నికు జరగాలి. మూడో సమస్య ఏమిటంటే అధికార వ్యవస్థ ఎన్నికల కోసం పని చేయడం. భారతదేశంలో ఎన్నికల కమిషన్ కు ప్రత్యేకంగా వ్యవస్థ లేదు. ఎన్నికలు ఉంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగానే అధీనంలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తుంది. దీని వల్ల రెండు నెలల పాటు పాలన మందగిస్తోంది. అదే సమయంలో ఎన్నికల నియమావళి అమలులోకి రావడం వల్ల ప్రభుత్వం కూడా ఏ పాలనా పరంగా ఎలాంటి పనీ చేయలేకుండా ఉండిపోతోంది. ఇక ఎన్నికల ప్రచారం… కోసం అధికారంలో ఉన్న ముఖ్యనేతలంతా.. ఆయా రాష్ట్రాల్లోనే మకాం వేస్తున్నారు. గుజరాత్, కర్ణాటక ఎన్నికల ప్రచార సమయంలో సాక్షాత్తూ ప్రధానమంత్రే.. నెలల తరబడి ఆయా రాష్ట్రాల్లో మకాం వేశారు. దేశాన్ని పాలించాల్సిన వ్యక్తి ఎన్నికల ర్యాలీల కోసమే ఎక్కువ సమయం కేటాయించారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఏమిటంటే.. జమిలీ ఎన్నికలు. అంటే.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం.

30 చోట్ల ఒకేసారి ఎన్నికలు – నాలుగైదు చోట్ల హంగ్ వస్తే..?
భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం… ఒకదానిపై ఒకటి ఆధారపడినవి కావు. ఈ మూడు రాజ్యాంగం నుంచి తమ ఉనికిని పొందుతున్నాయి. ఒక చోట ఎన్నికలు అవసరమైతే.. రెండో చోట కూడా ఎన్నికలు నిర్వహించడం .. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్పించడమన్న అభిప్రాయం ఉంది. ఇది ప్రాక్టికల్ గా ఎలా సాధ్యమన్న ప్రశ్న కూడా వస్తుంది. దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. పార్లమెంట్ తో కలిపి 30 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ 30 ఎన్నికల్లో పార్లమెంట్ లో ఎవరికీ మెజార్టీ రాదు. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే… ఐదేళ్ల పాటు ఎన్నికలు నిర్వహించకుడా ఉండలేరు. అలా అన్ని మళ్లీ అన్ని రాష్ట్రాలకూ నిర్వహించలేరు. ఇలా కాకపోయినా..పార్లమెంట్ లో ఓ పార్టీకి మెజార్టీ వచ్చి… నాలుగో, ఐదో రాష్ట్రాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే.. .. ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోతే.. వాటి పరిస్థితి ఏమిటి..? వాటి కోసం మళ్లీ మొత్తం ఎన్నికలు నిర్వహిస్తారా..? అందు వల్ల ప్రాక్టికల్ గా జమిలీ ఎన్నికలు అయ్యే పని కాదు.

రెండన్నరేళ్లకు ఓ సారి ఎన్నికలెలా సాధ్యం..?
అందుకే నీతిఆయోగ్ ముందు లా కమిషన్ ఓ ప్రతిపాదన పెట్టింది. అదేమిటంటే.. రెండున్నరేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుపుతామనేదే ఆ ప్రతిపాదన. 2019లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు అవసరం అయితే.. 2022లో నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వస్తే 2024లో నిర్వహిస్తామనేదే ఆ ప్రతిపాదన. దీని వల్ల తరచూ ఎన్నికలు రావని వారి విశ్లేషణ. దీంట్లోనూ ఇబ్బందులున్నాయి. ఉదాహరణకు కర్ణాటకలో కర్ణాటక-జేడీఎస్ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వం పడిపోయిందనుకోండి… మళ్లీ ఎన్నికలు 2022లో నిర్వహిస్తారు. అప్పటి వరకూ రాష్ట్రపతి పాలన విధిస్తారు. అది సాధ్యం కాదు. అందువల్ల రెండున్నరేళ్ల ప్రతిపాదన కూడా ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. ఈ విషయాన్ని పార్లమెంట్ ఎన్నికలకూ అన్వయించినా సాధ్యం కాదని సులువుగా అర్థం చేసుకోవచ్చు. రాజ్యాంగ పరంగా సాధ్యం కాదు.

ప్రత్యామ్నాయాన్ని చూపిస్తేనే అవిశ్వాసమా..?
దీనికి కూడా ఓ పరిష్కారం చూపిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలన్నా… విశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నా.. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని నిరూపిస్తేనే.. ఆ అవిశ్వాస, విశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలనేది..ఆ పరిష్కారం. అంటే… మెజార్టీ లేకపోయినా.. ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చు. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి.. ఇవన్నీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పరిష్కారం కోసం మరో వాదన వినిపిస్తున్నాయి. పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేనప్పుడు.. గవర్నర్ ఎమ్మెల్యేలను పిలిచి.. మీ నాయకుడ్ని ఎన్నుకోమని అడగాలి. ఎవరు నాయకుడిగా ఎన్నికైతే.. అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే.. ఓ బహుపార్టీ ప్రభుత్వం అవుతుంది. ఉదాహరణకు కర్ణాటకలో ప్రభుత్వం పడిపోతే… గవర్నర్ ఎమ్మెల్యేలను పిలిచి నాయకుడ్ని ఎన్నుకోమనాలి. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇదెలా సాధ్యమవుతుంది..? ఇది కూడా ప్రాక్టికల్ గా సాధ్యం కాదు.

అధికారం ఒకరి చేతిలోనే ఉండకూడదు..!
జమిలీ ఎన్నికలనేదే సిద్ధాంతం.. ఆచరణలో సాధ్యం కాదు. రాజ్యాంగరీత్యా అనేక సమస్యలు ఉన్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్లకు ముందే..రద్దు చేయాలి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు… ఐదేళ్ల కంటే ఎక్కువ సమయం కొనసాగించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. రాజకీయ అధికారం అనేది ఒక్కరి చేతిలో ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల్లో వివిధ పార్టీలు అధికారంలో ఉండటం వల్ల రాజకీయాధికారం అంతా ఒక్కరి చేతుల్లోకి వెళ్లదు. ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల ఒక్కరి చేతికే అధికారం వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. భారతదేశంలో కేంద్రంలో , రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు… 77 శాతం ‍ఒకే పార్టీ గెలిచింది. మనం ఇప్పుడు ప్రజాస్వామ్యం ఖూనీ కాకుండా చూసుకోవాలి. రాష్ట్రాలకు అన్యాయం జరిగితే కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నచోట్ల ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరిగినా ప్రశ్నించగలరా..? అందుకే.. ఈ భిన్నత్వాన్ని మనం కోల్పోకూడదు.

ప్రభుత్వాలకు అయ్యే ఎన్నికల ఖర్చు చాలా పరిమితమే..!
రెండేళ్లకో సారి ఎన్నికలు జరగడం వల్ల చాలా ఖర్చుయిపోతుందని వాదన ప్రముఖంగా వినిపిస్తున్నారు. ఖర్చయిపోతుందని…ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తామా..? మరి ఐదేళ్లకు ఎందుకు.. పదేళ్లకో.. ఇరవైఏళ్లకో ఒకసారి ఎన్నికలు జరుపుకుంటే.. ఇంకా ఖర్చు మిగులుతుంది కదా. భారదేశంలో.. ఎన్నికల నిర్వహణకు అధికార అంచనాల ప్రకారం ఖర్చు రూ. 8 వేల కోట్లు. పార్లమెంట్, అసెంబ్లీలకు అన్నింటికి ఎన్నికలు నిర్వహించాడనికి రూ. 8వేల కోట్ల ఖర్చు. అంటే..సగటున ఏడాదికి రూ. 1600కోట్లు. అంటే.. సగటున ఒక్క ఓటుకు ఏడాదికి 27 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రజాస్వామ్యం కోసం.. ఏడాదికి ఒక్క ఓటర్ పై రూ. 27 రూపాయలు ఖర్చు పెట్టలేమా…?. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లన్నీ కలిపితే.. రూ. 30 నుంచి 35 లక్షల కోట్లు దాటిపోతుంది. ఇందులో కేవలం రూ.8వేల కోట్లు మాత్రమే.. ఎన్నికల ఖర్చు. రూ.35 లక్షల కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెడుతూంటే.. ప్రజాస్వామ్యం కోసం.. రూ. 8వేల కోట్లు ఖర్చు అయిపోతుందని బాధపడితే .. ఏమైనా అర్థం ఉందా..?. నిరవ్ మోదీ, విజయ్ మాల్యా తీసుకెళ్లిన డబ్బులతో ఇరవై ఏళ్ల ఎన్నికల ఖర్చు జరిగిపోతుంది. అయితే ఈ 8వేల కోట్లు ప్రభుత్వాలకు అయ్యే ఖర్చు. పార్టీలకు అయ్యే ఖర్చు కాదు. పార్టీలు.. వేల కోట్లు ఖర్చు చేస్తూంటాయి. ఈ ఖర్చు వల్ల ప్రజలకు లాభమే. పార్టీల దగ్గర పోగుపడిన సొమ్ము ప్రజల వద్దకు చేరుతుంది.

జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు..!
అందువల్ల జమిలీ ఎన్నికల వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవి రాజ్యాంగ సవరణల ద్వారా తీర్చేవి కావి. ప్రాక్టికల్ గా వచ్చే సమస్యలు. ప్రస్తుత ఎన్నికల విధానం వల్ల వస్తున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. అంటే.. ఎడెనిమిది విడతలుగా జరిగే ఎన్నికలను ఒకే విడత నిర్వహించుకోవచ్చు. ప్రచార వ్యవధిని తగ్గించుకోవచ్చు. నియామవళి అమలు గడువును తగ్గించుకోవచ్చు. ఇలాంటి పరిష్కాలు వెదుక్కోవాలి కానీ.. అసాధ్యమైన జమిలీ ఎన్నికల పేరుతో.. ప్రయోగాలు చేయడం మంచిది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com