ప్రొ.నాగేశ్వర్: బీజేపీ – టీఆర్ఎస్‌ రాజకీయ అవసరాలు కలిపిన మిత్రులు..!

తెలంగాణ బీజేపీ నేతలు … కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా యాత్ర ప్రారభించారు ఎన్నికల సమయం కారణంగా.. కేసీఆర్ సర్కార్ తీరును చీల్చి చెండాడేందుకు యాత్ర చేస్తున్నామని బీజేపీ చెబుతోంది. ఇక్కడే కొంత మంది అనుమానం వస్తోంది. బీజేపీకి టీఆర్ఎస్ అస్మదీయ పార్టీనా..? తస్మదీయ పార్టీనా..? అని.

బీజేపీపై టీఆర్ఎస్ సాఫ్ట్ కార్నర్..!

కేంద్రం నుంచి తెలంగాణకు ఏ కేంద్రమంత్రి ఎవరు వచ్చినా… కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగుడుతారు. దీన్ని టీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మోడీ ప్రభుత్వ అనేక విధానాలను టీఆర్ఎస్ సమర్ధించింది. నోట్ల రద్దు, జీఎస్టీలను సమర్థించింది. పదిహేనో ఆర్థిక సంఘం విధివిధానాలను వ్యతిరేకించినా ఇతర ప్రతిపక్షాలతో కలిసేది లేదని స్పష్టం చేసింది. బెంగళూరులో అన్ని ప్రతిపక్షాలు ఏకమైనా కేసీఆర్ వెళ్లలేదు. కేజ్రీవాల్ పోరాటానికి కూడా మద్దతు తెలుపులేదు. బీజేపీతో ఎక్కడా నేరుగా పోరాడటానికి కేసీఆర్ ముందుకు రాలేదు. బీజేపీ ప్రభుత్వం అనేక అంశాల్లో విఫలమైనా.. ఒక్క మాట కూడా టీఆర్ఎస్.. మాట్లాడలేదు. ఆఖరికి ప్రత్యేకహోదా గురించి..విభజన హామీల గురించి ఉద్యమాలు నడుస్తున్నాయి. కడప స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలు చేస్తున్నారు. కానీ ఇక్కడ బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం ఏ పోరాటం లేదు . ఏ దీక్షలూ లేవు. లేక పోగా కేంద్రం కట్టకపోయినా.. మేము పెడతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల పంపిణీపైనా.. హైకోర్టు విభజనపైనా ఎక్కడా ఉద్యమాల్లేవు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా కోసం డిమాండ్ చేస్తున్నారంటారు. కానీ ఈ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు కనిపించలేదు. యూపీఏ హయాంలో .. ఐటీఈఆర్ ప్రాజెక్ట్ మంజూరయింది. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కేంద్రం దీన్ని రద్దు చేసింది.అయినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ విధంగా నాలుగేళ్ల కాలంలో… తెలంగాణ ప్రభుత్వం బీజేపీతో రాజీ పడిపోయింది. దేనిపైనా… కేంద్రంపై తేవాల్సినంత ఒత్తిడి తేవడం లేదు.

టీఆర్ఎస్‌పై బీజేపీ అభిమానం..‍!

బీజేపీ కూడా.. టీఆర్ఎస్ విషయంలో కాస్తంత మెత్తగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటన చేసింది. బిల్లు కూడా పాస్ చేసి కేంద్రానికి పంపింది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి.. ఈ బిల్ పాస్ చేసి ఉంటే.. బీజేపీ చాలా పెద్ద స్థాయిలో ఆందోళన చేసి ఉండేది. బీజేపీకి చాలా బేస్ ఉన్న ఇష్యూ ఇది. హిందూ ఓట్లను పోలరైజ్ చేసుకునే ఇష్యూ ఇది. అయినా బీజేపీ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. వాస్తవంగా.. ఇది బీజేపీ రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడేది. కానీ బీజేపీ ఒక్కసారి ఖండించి వదిలేసింది. అంటే కేసీఆర్ కు ఇబ్బంది కలిగించే అంశాలను బీజేపీ హైలెట్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులు టీఆర్ఎస్ చేయడం లేదు. మొత్తంగా కేంద్రంపై పోరాడుతున్నామని చెబుతున్నారు కానీ…ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఒత్తిడి తెస్తున్నాం అంటున్నారు కానీ… అదంతా కంటి తుడుపుగానే సాగుతోంది.

బీజేపీ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగడం లేదు..!

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చేసిన రాజకీయ యాత్రల్లోనూ.. కాంగ్రెస్ మిత్రపక్షాలనో.. కాబోయే మిత్రపక్షాలనో కలిశారు తప్ప… ఇతర పార్టీలను కలవలేదు. బీజేపీపై ఆగ్రహంతో ఉన్న పార్టీలను కూడా కేసీఆర్ కలవలేదు.ఇవన్నీ కేసీఆర్ వైఖరిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. టీఆర్ఎస్ వైఖరి ఏమిటి..? టీఆర్ఎస్ కు తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. బీజేపీకి ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎదిగితే… కేసీఆర్ కు ప్రమాదం లేదు. ఎందుకంటే.. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం లేదు. ఇక ముందు ప్రత్యామ్నాయం కాదా అంటే.. చెప్పలేం. ఒకప్పుడు ఎన్డీఏలో తృణమూల్ మిత్రపక్షం. అప్పుడు బెంగాల్ లో బీజేపీ లేదు. కానీ తృణమూల్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. బీజేపీ ఒంటరిగా పోరాడటం ప్రారంభించింది. ఇప్పుడు మమతా బెనర్జీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అవుతోంది. అందుకే.. బీజేపీ టీఆర్ఎస్ కు ఇప్పుడు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు. భవిష్యత్ లో అయ్యే అవకాశం ఉంది. కానీ రాజకీయ పార్టీల ఆలోచన సరళి.. ఇప్పటికిప్పుడు వచ్చే చాలెంజ్ ల మీదే ఉంటుంది. 2019కి వచ్చే సరికి బీజేపీ.. టీఆర్ఎస్‌కు సవాల్ కాదు.

టీఆర్ఎస్ కి రాష్ట్రం – బీజేపీకి జాతీయ రాజకీయాల అవసరాలు..!

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే… బీజేపీ పెరిగితే టీఆర్ఎస్ కు లాభం. ఎలా అంటే బీజేపీ బలపడితే… టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు … చీలుతుంది. అందుకే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఒక్కసారిగా టీఆర్ఎస్ – బీజేపీ కలిస్తే… కాంగ్రెస్ బలం పెరుగుతుంది. ఎందుకంటే… అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఓటు కన్సాలిడేట్ అవుతుంది . ఇప్పుడు టీఆర్ఎస్ – బీజేపీ కలిస్తే… టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వారందరూ కాంగ్రెస్ కు ఓటు వేస్తారు. ఒక వేళ బీజేపీ విడిగా టీఆర్ఎస్ పై పోరాడితే… గవర్నమెంట్ కు వ్యతిేరకంగా ఓటు వేయాలనుకునేవారు కొంత మంది బీజేపీ వైపు మళ్లుతారు. అలాగే బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ను తిట్టినంత కాలం.. ముస్లింల మొగ్గు కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఎంఐఎం టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది. దీని వల్ల ముస్లిం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా ఉంటాయి.

టీఆర్ఎస్ – బీజేపీ ఇద్దరి టార్గెట్ కాంగ్రెస్సే..!

అందుకే.. బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారంటే.. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు చేసే ప్రయత్నమే. టీఆర్ఎస్, బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి ఈ వైఖరి తీసుకుంటోంది. ఇది తప్పాఒప్పా అనేది వాళ్ల అభిప్రాయం. రాహుల్ గాంధీ..సంగారెడ్డిలో సభ పెట్టి… టీఆర్ఎస్ పాలనను తీవ్రంగా విమర్శించారు. కానీ కేసీఆర్ పెద్దగా స్పందించలేదు. కానీ… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నల్లగొండ వచ్చి చేసిన విమర్శలపై మాత్రం వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. నిజానికి అమిత్ షా టీఆర్ఎస్ ను పెద్దగా విమర్శించలేదు. కానీ కేసీఆర్ మాత్రం తమాషాలు చేస్తున్నారా అని వాయించి వదిలి పెట్టారు. కేసీఆర్ కు రాహుల్ గాంధీ ప్రధాన శతృవా..? అమిత్ షా ప్రధాన శతృవా..?. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి.. రాహులే ప్రదాన శతృవు. కానీ కేసీఆర్ రాహుల్ విషయాన్ని పట్టించుకోకుండా అమిత్ షాను మాత్రం టార్గె్ చేశారు. అంటే.. బీజేపీని ఓ యాంటీ టీఆర్ఎస్ పార్టీకి చూపించేందుకు ప్రయత్నించారు. ప్రతిపక్షాల ఓట్లు చీల్చేందుకు ఇది అవసరం కూడా.

బీజేపీకి వేరే ఆప్షన్ లేదు..!

మరి బీజేపీ ఎత్తుగడ ఏమిటి..? టీఆర్ఎస్ ఏం చెప్పినా.. కాంగ్రెస్ తో కలవడం కష్టం. రాజకీయాల్లో ఇది అసాధ్యమని చెప్పలేం. కానీ కాంగ్రెస్ కన్నా బీజేపీతోనే టీఆర్ఎస్ కలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో ఓ వైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ ఉన్నప్పుడు.. .. కాంగ్రెస్ ను బలపరిచే ప్రయత్నాన్ని కేసీఆర్ చేయలేరు. అది తెలంగాణలో టీఆర్ఎస్ కు నష్టం చేస్తుంది. అందుకే తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ ను కాకుండా బీజేపీనే సపోర్ట్ చేస్తుంది. అందుకే బీజేపీ.. ఎప్పుడూ నాన్ కాంగ్రెస్ రీజినల్ పార్టీని దూరం చేసుకోదు. తాను అధికారంలోకి రావాలనుకునే పరిస్థితి వస్తే తప్ప… అక్కడ ప్రాంతీయ పార్టీల వ్యూహానికి అనుగుణంగానే వ్యవహరిస్తుంది. ఏపీలో ఈ విషయంలో బీజేపీకి ఆప్షన్ ఉంది. టీడీపీ లేకపోతే వైసీపీ ఉంది. తెలంగాణలో ఈ ఆప్షన్ లేదు. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు ఉంది పరిస్థితి. కాంగ్రెస్ బలహీనపడాలనేది బీజేపీ లక్ష్యం.

కొట్టాలి కానీ గాయపరచకూడదన్నది రెండు పార్టీల పరస్పర వైఖరి..!

బీజేపీ జాతీయ పార్టీ అవసరాల కోసం… టీఆర్ఎస్ కు ఇబ్బంది లేకుండా.. తెలంగాణ పార్టీ వ్యవహరిస్తోంది. ఇక్కడ బీజేపీ నేతలు. పార్టీ ఎదగాలంటే.. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటారు. జాతీయ స్థాయిలో నాన్ కాంగ్రెస్ రీజినల్ పార్టీగా అక్కడి నేతలు దగ్గర తీసుకుంటారు. అంటే ఇది ఓ కరమైన ప్రకటించని సర్దుబాటు లాంటిది. ఈ మొత్తంగా చూస్తే.. బీజేపీకి విమర్శించే పని టీఆర్ఎస్ చేయదు. టీఆర్ఎస్ కు ప్రమాదం తెచ్చే పని బీజేపీ చేయలేదు. ” కొట్టాలి కానీ గాయపరచకూడదు..”. అనే వైఖరిని ఈ రెండు పార్టీలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఈ రెండు పార్టీల మధ్య ఈ విచిత్ర బంధం కొనసాగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com